- ఇప్పటికే బాధితులుగా బాలీవుడ్ నటులు.. చిరంజీవికీ తప్పని కష్టాలు
- గుర్తించలేనంతగా డీప్‌ఫేక్ చేసి పోర్న్ సైట్లలో అప్‌లోడ్
- మెగాస్టార్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు
- సోషల్‌మీడియాలో ఫొటోలు పెట్టొద్దని ప్రజలకు పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ‘డీప్ ఫేక్’ ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులను టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ప్రస్తుతం డీప్‌ఫేక్‌ను అస్త్రంగా చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కొత్త అప్లికేషన్లతో డీప్ ఫేకింగ్ క్రియేట్ చేస్తున్నారు. వేరేవారి ఫేసులకు డీప్ ఫేక్ ద్వారా సెలబ్రిటీల ఫేసులు పెట్టి ఆ వీడియోలను, ఫొటోలను పోర్న్ సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు. వీటితో పాటు వివిధ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్యర్యారాయ్, రష్మిక మందన సహా పలువురు సినీ ప్రముఖులు డీప్‌ఫేక్ బారినపడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా డీప్ ఫేక్ వెంటాడుతోంది. దీనిపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏఐ టెక్నాలజీతో మాయాజాలం
ఏఐ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ కలవరం సృష్టిస్తున్నది. సామాన్యుల నుంచి ప్రధాని దాకా, సెలబ్రిటీల నుంచి కార్పొరేట్ కంపెనీల దాకా డీప్ ఫేక్ బారినపడి నష్టపోతున్నారు. నటి రష్మిక మందనకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో గతంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా కొంత మంది సెలబ్రిటీలు డీప్‌ఫేక్ బారినపడ్డారు. ఈ టెక్నాలజీ మొదట్లో అద్భుతంగా కనిపించినప్పటికీ ప్రస్తుతం సవాలుగా మారింది.
అసలేదో... నకిలీదేదో!
ముఖ కవళికలు, గొంతు సహా మనిషి రూపం మొత్తం నిజమేననే రీతిలో డీప్ ఫేక్ రూపొందిస్తున్నారు. దీనికోసం ఎన్‌కోడర్స్, డీకోడర్స్ లాంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఎన్‌కోడర్స్ రెండు చిత్రాల కదలికలను పరిశీలించి, వాటి మధ్య ఉన్న దగ్గరి పోలికలు, సారూప్యతను గుర్తిస్తుంది. డీకోడర్ టెక్నాలజీ ముఖాలను మార్చేస్తుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప గుర్తించలేని విధంగా డీప్ ఫేక్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందుకుగాను జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్‌వర్క్ అనే మరో సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇలా డీప్ ఫేకింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నది. డీప్ ఫేకింగ్ ద్వారా క్రియేట్ చేసిన పోర్న్ వీడియోలను రెడిట్ వెబ్‌సైట్ సహా వివిధ సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు. ఇది పోర్న్ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
చిరంజీవి ఫిర్యాదుపై దర్యాప్తు ముమ్మరం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సహాయంతో సైబర్ నేరగాళ్లు చిరంజీవి డీప్ ఫేక్‌ను క్రియేట్ చేశారు. అశ్లీల వీడియోలు సృష్టించి పోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేశారు. దీనిపై చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇప్పటికే తన డీప్‌ఫేక్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా.. పోస్టులను తొలగించాలని చీఫ్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దాంతో చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోలను పోలీసులు ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడ నుంచి పోస్టు చేశారనే దానిపై విచారణ చేపట్టారు. విదేశాల నుంచి వీడియోలు అప్‌లోడ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
జాగ్రత్తగా పరిశీలిస్తే పట్టేయొచ్చు: పోలీసులు
డీప్ ఫేక్ వీడియోలను అతి సులువుగా గుర్తించవచ్చని సైబర్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా డీప్ ఫేక్‌లోని కళ్లు అసహజంగా ఉంటాయనేది గమనించాలని సూచిస్తున్నారు. ఏదైన అనుమానిత వీడియోను గుర్తిస్తే... అందులోని వీడియోలో కళ్లు ఆర్పకుండానో, లేదా ఎక్కువగా బ్లింక్ చేయడం గమనిస్తే అది డీప్ ఫేక్‌గా భావించాలి. ముఖ కవళికలు, వీడియోలో కనిపించే కలర్స్‌ను క్షుణ్ణంగా గమనించాలి. వీడియోలోని విజ్‌వల్, ఆడియో మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్ చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పోర్న్ సైట్ల ద్వారా మొబైల్ లేదా కంప్యూటర్ లలోకి హ్యాకర్లు చొరబడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా గ్యాలరీలోని వీడియోస్, ఫొటోలను డీప్ ఫేక్ చేసే ప్రమాదం ఉంది. ఆ తరువాత వాటితో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
