- 12 జిల్లాల్లో కొనేందుకు సీసీఐ నిరాకరణ
- మొంథా తుఫాన్‌తో తడిసిన పంట
- నిల్వ చేసే పరిస్థితుల్లేక ఇబ్బందులు
- ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నరు
- కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ రాసినా స్పందన కరువు
హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్య లేకపోవడంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 12 జిల్లాల్లో కొనుగోళ్లు ఆపేసింది. దీంతో పంటను అమ్ముకోవడానికి రైతులు తిప్పలుపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించింది. బిడ్డింగ్‌లో పాల్గొన్న జిన్నింగ్ మిల్లుల్లో 320 ఫ్యాక్టరీలు పత్తి కొనుగోళ్లకు అర్హత సాధించాయి. అయితే, ఇప్పటి వరకు 143 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు షురూ అయ్యాయి. ఈ జిన్నింగ్ మిల్లుల్లో కేవలం రూ.37 కోట్ల విలువైన 4,600 టన్నుల కాటన్ మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.
అక్టోబర్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉండగా.. సీసీఐ విధించిన కొత్త నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు ముందుకు రాకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. కొనుగోళ్లు ప్రారంభంలోనే మొంథా తుఫాన్ కారణంగా పత్తి తడిసి ముద్దయింది. సీసీఐ కొత్త నిబంధనలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి.
అత్యధికంగా వరంగల్ జిల్లాలో నష్టం
ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ తదితర జిల్లాల్లో 1.51 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ఈ జిల్లాల్లోని జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 55వేల ఎకరాల్లో, నల్లగొండ జిల్లాలో 23,911 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 22,574 ఎకరాల్లో, నాగర్‌కర్నూల్ జిల్లాలో 18,647 ఎకరాల్లో, మహబూబాబాద్ జిల్లాలో 8,752 ఎకరాల్లో, జనగాం జిల్లాలో 6,445 ఎకరాల్లో, కరీంనగర్ జిల్లాలో 7,562 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయింది.
విరబూసిన పత్తి పూత మొత్తం నానిపోయింది. తేమ 8–12% మధ్య ఉంటేనే పత్తి కొంటామని, ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు సీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 8 శాతం నుంచి 12శాతంలో 8 శాతం కంటే ఎంత ఎక్కువున్నా ప్రతి శాతానికి మద్దతు ధరలో 10% కోత వేస్తామని సీసీఐ స్పష్టం చేసింది. దీంతో రైతులకు తేమతో పరేషాన్ తప్పడం లేదు.
ఆరబెట్టి తీసుకొచ్చినా.. దక్కని మద్దతు ధర
తేమ ఉన్న పత్తిని నిల్వ చేస్తే బ్లాక్ అవుతదని రైతులు భయపడుతున్నారు. ఇక అదే జరిగితే ఎవరూ కొనరని.. నిల్వ చేసేందుకు స్థలం కూడా లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా మద్దతు ధర రూ.8,110 కంటే రూ.2వేల నుంచి 3వేలకు పైగా తక్కువకే కొంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఫ్యాన్లతో పత్తిని ఆరబెట్టి మార్కెట్ కు తీసుకొచ్చినా.. మద్దతు ధర దక్కడం లేదు. తేమ నిబంధనను 20 శాతం వరకు సడలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కేంద్ర మంత్రికి లేఖ రాసినా.. స్పందన లేదు.
