- 9 నెలల్లో77 భవనాలకు అనుమతిచ్చిన హెచ్‌ఎండీఏ
- కోకాపేటలో జీ ప్లస్ 56 , జీ ప్లస్ 63 అంతస్తులకు పర్మిషన్లు
- బండ్లగూడ జాగీర్‌లో జీ ప్లస్ 47, జీ పస్ల్ 30 అంతస్తులు
- మరిన్ని ప్రాంతాల్లోనూ భారీ నిర్మాణాలకు అనుమతులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైరైజ్ భవనాల నిర్మాణం ఊపందుకుంటున్నది. భారీ నిర్మాణాల కోసం హెచ్‌ఎండీఏకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 65 అంతస్తుల బిల్డింగ్‌ల కన్ స్ట్రక్చన్లకు నిర్మాణదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. నగరంలో అపార్ట్మెంట్కల్చర్ వైపు ప్రజలు మొగ్గుచూపిస్తుండడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, కోకాపేట, బండ్లగూడ జాగీర్, కొండాపూర్, మణికొండలాంటి ప్రాంతాల్లో హైరైజ్ భవనాలు, భారీసంఖ్యలో విల్లాల నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏకు అప్లికేషన్స్ వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి 9 నెలల కాలంలోనే 77 హై రైజ్ భవానలకు అనుమతులిచ్చినట్టు వెల్లడించారు. ఇందులో ఎక్కువగా కోకాపేటలోనే ఉన్నాయని తెలిపారు. ఇటీవల ఇక్కడ జీ+63, జీ+56 అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చారు. ఈ 9 నెలల కాలంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రాంతాల నుంచి భవన నిర్మాణాలు, లేఔట్స్ పర్మిషన్ కోసం 6,079 దరఖాస్తులు రాగా.. ఇందులో హైరైజ్ అంటే 30 అంతస్తులకు పైగా ఉన్నవే 50 కంటే ఎక్కువున్నట్టు అధికారులు వెల్లడించారు.
హైరైజ్ భవనాలు ఎక్కడెక్కడ అంటే?
గండిపేట్ మండల పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాల్లో హెచ్ఎండీఎ ఇటీవల భారీ మల్టీ-స్టోరీ నిర్మాణాలు కొన్నింటికి అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు నగర రూపురేఖలను మార్చేలా కీలకంగా నిలవనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో కోకాపేట్ గ్రామంలో 2.17 ఎకరాల విస్తీర్ణంలో ఒక బ్లాక్ నిర్మాణానికి అనుమతి లభించింది. దీన్ని 5 సెల్లార్లు + గ్రౌండ్ + 63 అంతస్తులతో నిర్మించనున్నారు. బిల్టప్ ఏరియా 15,45,994 చదరపు అడుగులు కాగా.. మొత్తం 362 ఫ్లాట్లను నిర్మించనున్నారు. కోకాపేట్‌లోనే మరో సంస్థ 7.71 ఎకరాల్లో 5 బ్లాకులు, ప్రతి బ్లాక్ లో 4 సెల్లార్లు + గ్రౌండ్ + 56 అంతస్తులతో బిల్డింగ్ నిర్మిస్తున్నది. నిర్మాణ విస్తీర్ణం 55,44,206 చదరపు అడుగులు కాగా.. మొత్తం 656 ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఇక్కడే ఇంకో సంస్థ 9.71 ఎకరాల్లో (5 సెల్లార్లు + గ్రౌండ్ + 57 అంతస్తులు) , ఒక కమర్షియల్ బ్లాక్ (5 సెల్లార్లు + గ్రౌండ్ + 49 అంతస్తులు) ఉన్నాయి. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 66,03,556 చదరపు అడుగులు కాగా.. 594 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. బండ్లగూడ జాగీర్ గ్రామంలో 3.22 ఎకరాల ప్రాజెక్ట్‌లో మరో సంస్థ 2 బ్లాకులు, 3 సెల్లార్లు + స్టిల్ట్ + 30 అంతస్తుల నిర్మాణం చేపట్టనున్నది. దీని బిల్టప్ ఏరియా 15,03,090 చదరపు అడుగులు కాగా.. మొత్తం 446 ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఇక్కడే మరో సంస్థ 2.34 ఎకరాల్లో 47 అంతస్తులు, బిల్టప్ ఏరియా 13,51,476 చదరపు అడుగుల్లో 344 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. ఇలా ఆయా కంపెనీలు పదుల సంఖ్యలో హైరైజ్ భవనాల నిర్మాణాలకు హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. హెచ్‌ఎండీఏ పారదర్శక విధానాల్లో ఉన్న వేగాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. బిల్డింగ్ అనుమతుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్ల అభివృద్ధికి ఆమోదం లభించిందన్నారు. 2025 మొదటి 9నెలలు మల్టీ స్టోరీ భవనాల అనుమతుల పరంగా చూస్తే అసాధారణమైన ప్రగతి సాధించామని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.
భారీ నిర్మాణాలు సరే.. మౌలిక సదుపాయాలేవి?
గ్రేటర్ పరిధిలో హెచ్‌ఎండీఏ అధికారులు భారీ సంఖ్యలో హైరైజ్ భవనాలకు అనుమతులిస్తున్నారు. అయితే, ఇవి పూర్తయిన తర్వాత ఏర్పడే పరిస్థితులను తట్టుకునే యంత్రాంగం ఉన్నదా? అని బిల్డర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చిన్న వర్షానికే నగరంలో రోడ్లన్నీ ఏరులై పారుతున్నాయని, ముఖ్యంగా ఐటీ కారిడార్, ఎస్‌ఈజడ్‌లలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంత భారీ నిర్మాణాల అనంతరం ఏర్పడే ట్రాఫిక్ సమస్యలు కానీ, డ్రైనేజీ వ్యవస్థ, ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారానికి ఏరకమైన చర్యలు తీసుకుంటారన్న విషయంలో స్పష్టత లేదని చెబుతున్నారు. అలాగే ఆయా భవనాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రమాదాల నిర్వహణ ఎలా ఉంటుందన్న విషయం పై కూడా క్లారీటీ లేదని అంటున్నారు. భారీ భవనాలు నిర్మిస్తున్నా అందుకు తగ్గట్టు సదుపాయల కల్పనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
భవనాలపై హెలిప్యాడ్ సౌకర్యం..
హైరైజ్ భవనాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు డిమాండ్ ఉండడంతో .. ఇందులో విలాసవంతమైన వసతులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ స్విమ్మింగ్ పూల్, జిమ్ , క్లబ్హౌస్లాంటి వసతులనే లగ్జరీగా భావించేవారు. కానీ, ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా అంతర్జాతీయ స్థాయి వసతులను కోరుకుంటున్నారు. దీంతో గోల్ఫ్ కోర్ట్, హెలీప్యాడ్, స్కైవాక్‌లాంటి విలాసవంతమైన వసతులను సైతం నిర్మాణ సంస్థలు అందిస్తున్నాయి. ఇప్పటివరకూ కూకట్‌పల్లి, నానక్‌రాంగూడ, నియోపోలిస్ ప్రాంతాల్లోని పలు లగ్జరీ అపార్ట్‌మెంట్లు, మాదాపూర్‌లోని ఓ హోటల్ పైకప్పుపై హెలీప్యాడ్ నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. లోధా, ఎల్‌అండ్‌టీ -ఫోనిక్స్, మంజీరా, మంత్రి, జీహెచ్‌ఆర్ లాంటి సంస్థలు ఈ విలాసవంతమైన సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
