డీప్ ఫేక్ను అడ్డుకునేందుకు కొత్త చట్టాలు తేవాలి: చిరంజీవి

డీప్ ఫేక్ను అడ్డుకునేందుకు కొత్త చట్టాలు తేవాలి: చిరంజీవి
  • టెక్నాలజీ పెరిగినా కొద్దీ..ముప్పూ పెరుగుతున్నది: చిరంజీవి
  • నెక్లెస్ రోడ్​లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
  • రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్న డీజీపీ, సీపీ

ట్యాంక్ బండ్, వెలుగు: డీప్ ఫేక్.. గొడ్డలి పెట్టు లాంటిదని, అలాంటి వాటి నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. ముప్పు కూడా పొంచి ఉంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి జల విహార్ వరకు శుక్రవారం రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. 

చిరంజీవి, డీజీపీ శివధర్ రెడ్డి జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ‘‘ఇటీవల నేను డీప్​ఫేక్ వీడియోతో ఇబ్బందులు పడ్డ. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశా. సీపీ సజ్జనార్ ఈ కేసును సీరియస్​గా తీసుకుని స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. అండగా ఉన్నామని ధైర్యం చెప్పారు. కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటూ జాగ్రత్తగా ఉండాలి’’అని చిరంజీవి అన్నారు. 

ముక్కలైన సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి దేశాన్ని ఒకటి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని, తాము డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నామని సిటీ సీపీ సజ్జనార్ అన్నారు. ఇకపై సైబర్ నేరస్తుల మూలాలపై దృష్టి సారించామని తెలిపారు. 

సైబర్ క్రిమినల్స్ దిగజారిపోయారని, పిల్లలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇచ్చి మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నారన్నారు. ఇలాంటి కేసుల్లో పేరెంట్స్ కూడా ఇరుక్కుంటారని హెచ్చరించారు. ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎల్అండ్​వో అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వారావు, సైబర్ క్రైమ్స్ డీసీపీ ధార కవిత పాల్గొన్నారు.