- పూర్తయిన రైల్వే స్టేషన్ పనులు
- రెండు నెలల్లో ప్రారంభం కానున్న మహా జాతర
సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దసరా పండగకు ప్రారంభిస్తామని ఆగస్టులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించినా స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు నిలిచిపోయాయి. మరోవైపు స్టేషన్పనులన్నీ పూర్తయినా ఎప్పుడు ప్రారంభిస్తారనేది మాత్రం తెలియడంలేదు. ఈ స్టేషన్ ప్రారంభిస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు తొలిగిపోతాయి.
ఏటా కొమురవెల్లికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు పాతిక లక్షల మంది మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తుంటారు. మరో రెండు నెలల్లో మహా జాతర ప్రారంభం అవుతుండడంతో వెంటనే రైల్వే స్టేషన్ను ప్రారంభించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
పూర్తి సౌకర్యాలతో రైల్వే స్టేషన్ ఏర్పాటు
కొమురవెల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ లో సకల సౌకర్యాలను కల్పించారు. అర ఎకరం స్థలంలో 400 మీటర్ల పొడవు ప్లాట్ ఫామ్స్నిర్మించారు. ప్రస్తుతం కొండపాక వైపు మాత్రమే నిర్మిస్తుండగా భవిష్యత్లో మరో రైల్వే ట్రాక్ నిర్మాణం చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. స్టేషన్ బిల్డింగ్, వెయిటింగ్ హాల్, షెల్టర్ సీటింగ్, టికెట్ కౌంటర్, ప్యాసింజర్ వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్, ప్లాట్ ఫామ్ లను అందంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్డుకు 500 మీటర్లు ప్రత్యేకంగా సీసీ రోడ్డును నిర్మించారు. రైల్వే స్టేషన్ ప్రహరీతో పాటు పలు చోట్ల మల్లన్న చిత్రాలను గీయించారు.
భక్తులకు తొలగనున్న ఇక్కట్లు
మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా సాంకేతిక కారణాలతో మొదట లకుడారం వద్ద రైల్వే స్టేషన్ నిర్మించారు. దీంతో భక్తులు లకుడారం స్టేషన్ నుంచి కొమురవెల్లికి రావాలంటే 12 కిలోమీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్య ప్రధాన అడ్డంకి మారడంతో స్థానికులు రాష్ట్ర , కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో రైల్వే అధికారులు పరిశీలించారు.
కొమురవెల్లి వద్ద రైల్వే లైన్ స్కిప్పర్ గ్రేడ్ లోకి రావడంతో రైల్వే స్టేషన్ ఏర్పాటు నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీనిపై టెక్నికల్ కమిటీ ప్రత్యేక పరిశీలన జరిపి స్కిప్పర్ గ్రేడ్ లో ఉన్న ప్రదేశాల్లో స్పెషల్ సేఫ్టీ మెజర్స్ తో స్టేషన్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. రైల్వే స్టేషన్ ప్రారంభమైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా కష్టాలు తొలగిపోతాయి.
