30 ప్రైవేటు బస్సులపై కేసు..రూ. 1.06 లక్షల జరిమానా

30 ప్రైవేటు బస్సులపై కేసు..రూ. 1.06 లక్షల జరిమానా

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో నిబంధనలను పాటించని ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నగరంలోని సెంట్రల్​జోన్​పరిధిలో 5 బస్సులు రిఫ్టెక్టివ్​టేప్స్​డ్యామేజ్, బస్సు రంగుల ఆల్ట్రేషన్​ల కారణంగా కేసులు నమోదు చేశారు. వీరిపై రూ. 25 వేలు జరిమానా విధించారు. అలాగే ఈస్ట్​జోన్​ పరిధిలో కమర్షియల్​గూడ్స్​తరలిస్తుండడం, ఫస్ట్​ఎయిడ్​బాక్స్​లేక పోవడం, డ్రైవర్​యూనిఫారం లేని కారణంగా 2 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 8 వేల జరిమానా విధించారు. 

వెస్ట్​జోన్​పరిధిలో కమర్షియల్​గూడ్స్​తరలిస్తున్న, ఫైర్​సేఫ్టీ లేని 3 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.15 వేల జరిమానా విధించారు. నార్త్​జోన్​పరిధిలో కమర్షియల్​గూడ్స్​తరలింపు, యూనిఫారం లేని 10 బస్సులపై కేసు నమోదు, రూ. 20వేల జరిమానా విధించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కమర్షియల్​ గూడ్స్​తరలింపు, ఫస్ట్​ఎయిడ్ కిట్ లేక పోవడం, యూనిఫారం లేని కారణంగా 10 బస్సులపై కేసులు నమోదు చేసి 38 వేల జరిమానా విధించారు. 

గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్​ బస్సుల తనిఖీల్లో ఇప్పటి వరకూ 244 కేసులు నమోదు కాగా రూ.6.11 లక్షల జరిమానా రూపంలో వసూలు చేశారు. అలాగే 9 బస్సులను సీజ్​ చేశారు. తాజాగా శుక్రవారం బెంగళూరు రూట్​లో ఓ బస్సులో ఎమెర్జెన్సీ డోర్​ను లాక్​ చేసిన విషయాన్న గుర్తించి నిర్వాహకులను మందలించారు.