నల్గొండ ప్రజలతో కేసీఆర్ ఫామ్​హౌస్​ను ముట్టడిస్తం: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ ప్రజలతో కేసీఆర్ ఫామ్​హౌస్​ను ముట్టడిస్తం: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

 

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరిక
  • కేటీఆర్ ప్రజెంటేషన్ చూస్తే ఆయనో జోకర్ అని అర్థమైంది
  • మూసీ మురికితో నల్గొండ బిడ్డలు పడ్తున్న తిప్పలుకనిపిస్తలేవా? అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రాజెక్టును బీఆర్​ఎస్ అడ్డుకుంటే కేసీఆర్ ఫామ్​హౌస్ ను నల్గొండ ప్రజలతో కలిసి ముట్టడిస్తామని, మరో ఉద్యమం తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘మూసీకి అడ్డుపడే ప్రతి రాజకీయ పార్టీని నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారు. అప్పట్లో రజాకార్లపై తిరుగుబాటు, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమం లాంటి ఘటనలు రిపీట్​ అవుతాయి. ఎవరు అడ్డువచ్చినా ఈ ప్రాజెక్టు ఆగదు. మూసీ మురికి వల్ల నల్గొండ జిల్లా ప్రజలు పడుతున్న తిప్పలు చూసైనా ప్రాజెక్టుకు అందరూ సహకరించాలి” అని ఆయన పేర్కొన్నారు. శనివారం సెక్రటేరియెట్​లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్యతో కలిసి మంత్రి వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘పదేండ్లలో అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​ ఉమ్మడి నల్గొండకు అన్యాయం చేసింది. మా జిల్లా అంటే కేసీఆర్ కుటుంబానికి ఎందుకంత కోపం. ఇప్పుడు మూసీ శుద్ధీకరణ జరుగుతుంటే ఆ పార్టీ నేతలు  ప్రజలను రెచ్చగొడుతున్నారు.  రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకులు నల్గొండ ప్రజలు కాదు. పోల గడ్డ, పౌరుషం ఉన్న వ్యక్తులం మా జిల్లా ప్రజలం” అని తెలిపారు. మూసీ శుద్ధీకరణ, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ పూర్తి చేస్తున్నందుకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. 

కేటీఆర్​ అబద్ధాలను ఎవరూ నమ్మరు

మూసీపై కేటీఆర్​ ఇచ్చిన ప్రజెంటేషన్​ చూస్తే ఆయనో జోకర్​ అని అర్థమైందని మంత్రి వెంకట్​రెడ్డి విమర్శించారు. ‘‘కాళేశ్వరం డీపీఆర్​కు 2015లోనే  రూ.33 కోట్లు చెల్లించారు. అట్లాంటిది ఇప్పుడు మూసీ కోసం రూ.140 కోట్లు చెల్లిస్తుంటే గగ్గోలు పెడుతున్నడు.  మాట్లాడటం వచ్చని అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కేసీఆర్ కుటుంబ మోసాల్ని ప్రజలు పసిగట్టారు కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో బుద్ధిచెప్పిన్రు. అప్పుడే పార్టీ మూసుకొని విదేశాలకు వెళ్లి బతుకుతడేమో అనుకున్న. సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూ ఇక్కడే తిరుగుతున్నడు. అసలు మూసీ డీపీఆర్ పూర్తికాకముందే ఎందుకు లక్షల కోట్లని ఎగిరెగిరి పడుతున్నడు?” అని మండిపడ్డారు. ‘‘రూ. 2 వేల కోట్లు పెట్టి 9 కిలోమీటర్ల ఎస్​ఎల్​బీసీ  సొరంగం పని పూర్తి చేస్తే ఇప్పుడు 4 లక్షల ఎకరాల నల్గొండ భూములు బంగారు మాగాణంగా మారేవి. ఫ్లోరైడ్ ఇబ్బందులూ తప్పేవి. కేవలం నాకు పేరొస్తుందనే ఎస్ఎల్​బీసీ సొరంగాన్ని పదేండ్లు కేసీఆర్​ పక్కనపెట్టిండు” అని అన్నారు.  మూసీలో ప్రమాదకరస్థాయిలో హెవీ మెటల్స్​ ఉన్నాయని కేంద్ర పర్యావరణ సంస్థ చెప్పిన సంగతి కేటీఆర్​కు తెలియదా? అని ప్రశ్నించారు. మూసీ మురికి వల్ల నల్గొండ ప్రజలు పడ్తున్న బాధలు అన్నీ ఇన్నీ కావని, వారు పడ్తున్న తిప్పలు కనిపస్తలేవా అని ప్రశ్నించారు. ‘‘కేటీఆర్​కు అధికారం పోవడంతో మానసికంగా ఇబ్బందులు పడ్తున్నట్లు కనిపిస్తున్నది. 

ప్రధాన మంత్రిని, ముఖ్యమంత్రిని కూడా తిడ్తున్నడు. ఆయన డాక్టర్​కు చూపించుకుంటే మంచిది” అని హితవుపలికారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్​కి ఏమీ తెల్వదని.. వాళ్లు ఢిల్లీ నుంచి వచ్చి మాట్లాడి వెళ్లే గెస్ట్‌‌‌‌లన్నారు. కిషన్ రెడ్డికి మూసీ ఎక్కడ ఉందో కూడా తెలవదని దుయ్యబట్టారు. ‘‘నల్గొండలో పుట్టిన చిట్టినాయుడు (మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి ) మొన్నటి ఎన్నికల్లో 3 వేల ఓట్లతో గెలిచినా ఆయనకు జిల్లా సమస్యలు పట్టవు. అధికారం అడ్డం పెట్టుకొని పది వేల కోట్లు దోచుకున్న ఆయన.. ఎప్పుడూ నల్గొండ బాగుకోసం పనిచేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి దామోదర్ రెడ్డికి మోకాలి ఆపరేషన్ కావడంతో చిట్టి నాయుడు బతికిబయటపడ్డడు. లేదంటే 50 వేల మెజార్టీతో ఇంటికి పంపేవాళ్లం” అని వెంకట్​రెడ్డి వ్యాఖ్యానించారు.