కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం, ఐటిపాములలో  ప్రతీక్ ఫౌండేషన్  ఆర్థిక సహాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా  ఏర్పాటుచేసిన  "స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ల" ను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. మహిళలనుకుంటే సాధించలేనిది ఏది లేదని.. మహిళలు వంటింటికే పరిమితం కాదని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. 

అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు న్యూక్లియర్ ,థర్మల్ విద్యుత్తును పక్కన పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వెళుతున్నారని అన్నారు. మహిళలు ఇంటి వద్దనుండే ఆదాయం పొందేందుకు సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేశామని.. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలను లక్షాధికారులుగా చేశామని అన్నారు కోమటిరెడ్డి. 

తాను శాసనసభ్యుడిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు 350 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇప్పించానని.. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో  కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు కోమటిరెడ్డి. స్వశక్తితో మహిళలు పైకి రావాలనే ఉద్దేశంతో ప్రతీక్  ఫౌండేషన్ ద్వారా  50 మంది స్వయం సహాయక మహిళలకు 50 లక్షల రూపాయలను ఇచ్చి యూనిట్లు ఏర్పాటు చేశామని అన్నారు.

త్వరలోనే ఈ 50 మంది మహిళలకు  బ్యాంకుల ద్వారా మూడు లక్షల రూపాయల చొప్పున బ్యాంకు రుణాలను  ఇచ్చేలా చూస్తామని అన్నారు.రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున జూన్ 2న స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు.