
- టిమ్స్, కలెక్టరేట్లను వేగంగా పూర్తి చేయాలి: మంత్రి వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, నిర్మాణంలోని ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ శాఖ ఆఫీసర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 1,062 ప్రాంతాల్లో,1,370 కి.మీ రాష్ట్ర రోడ్లు దెబ్బతిన్నాయని,68 రోడ్లు కోతకు గురికాగా 38 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేసినట్టు ఆర్ అండ్ బీ శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ మంత్రికి వివరించారు. సుమారు రూ.306 కోట్ల సీడీ వర్క్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.72.49 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1,263.33 కోట్ల నిధులు అవసరం అవుతాయని ఆఫీసర్లు వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పూర్తి స్థాయి తాత్కాలిక రిపేర్లు చేపట్టాలని మంత్రి అదికారులను ఆదేశించారు.
టిమ్స్, మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్ల పనుల వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తుది దశకు చేరుకున్న ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్లను త్వరగా పూర్తి చేసి ఓపెనింగ్స్‌కు సిద్ధం చేయాలన్నారు.
నారాయణపేట, ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలని, ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి హ్యామ్ రోడ్ల పై ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు.