- కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై కేసీఆర్, కేటీఆర్ నిర్లక్ష్యం: మంత్రి వెంకట్‌రెడ్డి
- కేంద్ర మంత్రులు గడ్కరీ, అనురాగ్ ఠాకూర్‌తో మంత్రి భేటీ
- ట్రిపుల్ ఆర్, నేషనల్ హైవేల విస్తరణకు సహకరించాలని వినతి
- రాయగిరిలో స్టేడియానికి రూ. 33.5 కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ, వెలుగు : గత పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరిగి.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్ట్ లు ఆగిపోయాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రం నుంచి రోడ్లు, ప్రాజెక్టులు తీసుకురావడంపై ఎప్పుడూ ఆసక్తి చూపలేదని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ వంటి స్కీంను కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్‌తో మంత్రి భేటీ అయ్యారు.
మంత్రి వెంట ఎమ్మెల్యేలు బి.మనోహర్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీ నివాస రాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు. తొలుత నితిన్ గడ్కరీని కలిసి ట్రిపుల్ ఆర్ నిర్మాణం, హైదరాబాద్– విజయవాడ ఎన్ హెచ్ విస్తరణ, నల్గొండ బైపాస్ ఇతర అంశాలను దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 15 రాష్ట్ర రోడ్లను నేషనల్హైవేలుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం కోసం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంపై డీపీఆర్ ను అందజేశారు. నల్గొండ జిల్లాలో హైదరాబాద్-–విజయవాడ ఎన్హెచ్పక్కన ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం రూ.65 కోట్లను వన్ టైం గ్రాంట్ క్రింద మంజూరు చేయాలని కోరారు. తర్వాత అనురాగ్ ఠాకూర్ ను కలిసి భువనగిరి జిల్లా రాయగిరిలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ‘ఖేలో ఇండియా స్కీం’ కింద రూ.33.5 కోట్లు ఇవ్వాలని కోరారు. అనంతరం కోమటి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
ట్రిపుల్ ఆర్ కు సంబంధించి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్ర వాటా కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.300 కోట్లు కూడా రిలీజ్ చేయకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. ఉప్పల్–ఘట్కేసర్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఐదేండ్లుగా కొనసాగుతున్నాయని విమర్శించారు. స్థలం కేటాయిస్తే హైదరాబాద్ లో స్కిల్ డ్రైవింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గడ్కరీ చెప్పినట్లు పేర్కొన్నారు.