నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • కార్పొరేషన్​ గెలిచి సీఎంకు గిఫ్ట్​గా ఇస్తా
     

నల్గొండ, వెలుగు: నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని, కార్పొరేషన్​ను గెలిచి సీఎంకు గిఫ్ట్​గా ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.20 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నల్గొండ పట్టణాభివృద్ధికి ఇప్పటివరకు రూ.2 వేల కోట్ల అభివృద్ధి పనుల చేసినట్లు తెలిపారు. పట్టణంలో 5 సబ్ స్టేషన్లు మంజూరు  చేశామని, నాలుగింటికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. నల్గొండ నుంచి మునుగోడు రోడ్డు, ధర్వేశిపురం రోడ్డు, ముశ్రం పల్లి డబుల్ రోడ్ పనులు, నల్గొండ నుంచి గుండపల్లి, కురంపల్లి వరకు రోడ్డు  పనులు 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు.

ఏడాది కాలంలోనే క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభించామని, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్​పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.250 కోట్లతో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్త బిల్డింగ్ తోపాటు, కొత్త కోర్సులు బీ ఫార్మసీ, ఎల్ఎల్​బీ తీసుకువచ్చామని, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సెట్విన్ స్థాపించామని, నల్గొండ కార్పొరేషన్ లో 24 గంటలు కృష్ణా నీటిని  సరఫరా చేసేందుకు రూ.125 కోట్లతో డీపీఆర్ ప్రభుత్వానికి పంపించామన్నారు.  రూ.140 కోట్లతో లతీఫ్ సబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్ పనులు కొనసాగుతున్నాయని, మార్చిలోపు పనులు పూర్తవుతాయని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినందున కేంద్రం ద్వారా నేరుగా నిధులు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల పట్టణ ప్రజలు సామరస్యంతో పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

నల్గొండను హైదరాబాద్ కు సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. అనంతరం పట్టణంలోని వీటి కాలనీ, చింతల్ పార్క్, దేవరకొండ రోడ్డు, సావర్కర్ నగర్, పాలిటెక్నిక్, తదితర ప్రాంతాల్లో పార్కులు, రహదారులు, బీటీ రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లు, తాగునీటి సరఫరా తదితర పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, ప్రజారోగ్య సంస్థ సూపరింటెండెంట్​ఇంజనీర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ  మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తహసీల్దార్ పరుశురాం పాల్గొన్నారు.