- నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు
నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు లెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా ప్రారంభించిన ఎస్ఈ కార్యాలయం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలు లేని పట్టణంగా నల్లగొండను తీర్చిదిద్దుతానన్నారు.
నల్గొండ పట్టణంలో రూ.272 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా పథకాలను చేపట్టామన్నారు. రూ.53 కోట్లతో టీయూఎఫ్ ఐడీసీ ద్వారా రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. మరో రూ.109 కోట్లతో సీసీ రోడ్లు, రూ.9 కోట్లతో పట్టణం నలువైపులా సబ్ స్టేషన్లను నిర్మాణం చేపట్టామన్నారు. రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామన్నారు. మానసికంగా , శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతో పాటు, క్రీడలు ముఖ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నల్గొండ జిల్లా,చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాలలో నిర్వహించనున్న 2 రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు ఇన్‌చార్జి కలెక్టర్, ఆర్డీఓ వై. ర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సంక్రాంతికి ట్రాఫిక్ లేకుండా చర్యలు
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 65పై సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ నాగార్జునతో కలిసి అర కిలోమీటర్ నడుచుకుంటూ రహదారి పనులను పరిశీలించారు. గత సంవత్సరం ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత సంక్రాంతికి 65వ జాతీయ రహదారిపై దాదాపు 9.97 లక్షలఫోర్ వీలర్ వెహికల్స్, 7 వేల బస్సులు ప్రయాణించగా, ఈసారి మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు.
అవసరమైతే అదనపు పోలీస్ సిబ్బందిని నియమించి అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రిస్తామని చెప్పారు. సూర్యాపేట, కోదాడ ప్రాంతవాసులకు కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చిట్యాల వద్ద రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణాశాఖ సమన్వయంతో సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. 65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. రాబోయే ఏడాదిన్నరలో రూ.10 వేల కోట్లతో జాతీయ రహదారి 65ను ఎనిమిది లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేసి మార్చిలో టెండర్లు పిలుస్తామన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రహదారి డీపీఆర్ కూడా సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.
