సూర్యాపేట: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024, జూన్ 15వ తేదీ శనివారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సంతోష్ రావు, వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్, కేటీఆర్ లు కలిసి.. బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని అన్నారు.
ఎల్ నర్సింహారెడ్డి విచారణ కమిటీని కేసీఆర్ రద్దు చేయడం అనడం విడ్డూరమన్నారు కోమటిరెడ్డి. యాదాద్రి, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. త్వరలో ఆధారాలతో సహా నిరూపిస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్ హయాంలో గొర్రెల స్కామ్ లో కూడా రూ.7 వందల కోట్ల స్కాం జరిగిందన్నారాయన. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టిందని తెలిపారు. ఢిల్లీలో రూ.11 వందల కోట్ల లిక్కర్ స్కామ్ చేసి.. కవిత జైల్లో ఊచల లెక్కబెడుతోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావుతో సహా అందరూ జైలుకు వెళ్తారని మంత్రి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏడేళ్ల వరకు బెయిలు రాదన్నారు. అందుకే అమెరికా నుంచి ప్రభాకర్ రావును రానివ్వడం లేదని అన్నారు. రాష్ట్రంలో పదేళ్లు కేసీఆర్.. ప్రజలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.