నల్గొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నల్గొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 33వ డివిజన్ మీర్‌బాగ్ కాలనీలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంజీ యూనివర్సిటీకి రూ.200 కోట్లు కేటాయించి కొత్త భవనాలు నిర్మించడంతో పాటు ఫార్మసీ కోర్సులను మంజూరు చేసినట్లు తెలిపారు.

మేయర్ ఎన్నిక అనంతరం ప్రతి డివిజన్‌లో ప్రజాదర్బారు నిర్వహించి కార్పొరేటర్ల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దేవరకొండ రోడ్, నార్కట్‌పల్లి రోడ్‌లలో 100 ఎకరాల్లో 8,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, అంగన్‌వాడీలకు సొంత భవనాలు నిర్మించి, 12 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా పట్టణానికి 24 గంటల తాగునీరు అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లలోనూ, 116 మున్సిపాలిటీల్లో 110 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.