ప్రాచీన శైవ క్షేత్రం ఐనవోలులో మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ( జనవరి 14 ) బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. మూడు రోజుల జాతర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని.. చిన్నపిల్లలు, వృద్ధులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు.ఆలయాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకు వెళుతోందని.. బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని అన్నారు కొండా సురేఖ.
మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా పారిశుధ్యం, మౌలిక వసతుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎంతో పేరు ఉన్న ఐనవోలు ఆలయ అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు కొండా సురేఖ. ఐనవోలు ఆలయ అభివృద్ధి దేవాదాయ శాఖ నుండి 2కోట్లు కేటాయిస్తానని.. ఆలయ పరిసరాల్లోని భూములను సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతరను 250 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. భక్తులు సమర్పించిన బంగారంతో ఆభరణాలు చేయించి దేవుళ్ళను ముస్తాబు చేస్తామని అన్నారు కొండా సురేఖ. గోదావరి వెంట ఉన్న ప్రతీ ఆలయాన్ని డెవలప్ చేస్తున్నామని.. సబ్ కమిటీ వేసి ఆలయాల అభివృద్ధిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.పుష్కరాల నిర్వహణలో తెలంగాణ ముందుందని.. టూరిజంలో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపి, ఆదాయం పెంచుతామని అన్నారు కొండా సురేఖ.
