కేటీఆర్.. ముందు కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించు.. తర్వాత మాట్లాడు: మంత్రి కొండా సురేఖ

కేటీఆర్.. ముందు కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించు.. తర్వాత మాట్లాడు: మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొండా సురేఖ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి.. ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ముందు కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించి ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని అన్నారు కొండా సురేఖ.

వరంగల్ నగర అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామని.. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం తాను తిరుపతి జేఈవో సలహా కూడా తీసుకున్నట్లు తెలిపారు కొండా సురేఖ. టెక్స్ట్ టైల్ పార్క్, మామునూరు ఎయిర్ పోర్ట్ పై సమీక్ష నిర్వహించామని.. ఎయిర్ పోర్ట్ కు భూములిచ్చిన రైతుల ఖాతాల్లో ఇప్పటికే 34 కోట్ల రూపాయలు వేశామని స్పష్టం చేశారు మంత్రి సురేఖ. 

అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై DPR సిద్ధం చేశామని.. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఎయిర్ పోర్ట్ పూర్తయితే వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. వరంగల్ బస్టాండ్ త్వరలోనే పూర్తి చేస్తామని.. వరంగల్ లో మొన్నటి వరదల్లో కొన్ని ఇళ్లు డ్యామేజీ అయ్యాయి, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి సురేఖ.