వెట్‌‌‌‌ల్యాండ్స్‌‌‌‌ పరిరక్షణకు పకడ్బందీ ప్రణాళిక ..12,249 నీటి వనరులకు నోటిఫికేషన్ వేగవంతం చేయాలి : మంత్రి కొండా సురేఖ

వెట్‌‌‌‌ల్యాండ్స్‌‌‌‌ పరిరక్షణకు పకడ్బందీ ప్రణాళిక ..12,249 నీటి వనరులకు నోటిఫికేషన్ వేగవంతం చేయాలి : మంత్రి కొండా సురేఖ
  • అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల (వెట్‌‌‌‌ల్యాండ్స్) ) పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వీటి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ‘తెలంగాణ రాష్ట్ర వెట్‌‌‌‌ల్యాండ్ అథారిటీ’ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వెట్‌‌‌‌ల్యాండ్స్ స్థితిగతులు, రక్షణ చర్యలపై సురేఖ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతలో వెట్‌‌‌‌ల్యాండ్స్ కీలకమని, 2017 నిబంధనల ప్రకారం వీటిని కాపాడాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 12,249 వెట్‌‌‌‌ల్యాండ్స్‌‌‌‌ను గుర్తించామని, అందులో 4,023 ప్రాంతాలకు సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందన్నారు.  మిగిలిన వాటికి కూడా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో సర్వే పూర్తి చేసి డిజిటల్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లోని 28 ప్రధాన వెట్‌‌‌‌ల్యాండ్స్‌‌‌‌కు సంబంధించి త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు.సంగారెడ్డి జిల్లాలోని మంజీరా వన్యప్రాణి అభయారణ్యానికి అంతర్జాతీయ స్థాయి 'రామ్‌‌‌‌సార్ సైట్' గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనను వెంటనే కేంద్ర పర్యావరణ శాఖకు పంపాలని ఆదేశించారు.  సమావేశంలో అహ్మద్ నదీమ్, సువర్ణ,  వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.