బల్కంపేటలో తోపులాట అల్లరి మూకల పనే:కొండా సురేఖ

బల్కంపేటలో తోపులాట అల్లరి మూకల పనే:కొండా సురేఖ
  • పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది
  • ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
  • మంత్రి కొండా సురేఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా మంగళవారం జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి వచ్చిన సందర్భంలో కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరి మూకలు కావాలనే తోపులాటకు దిగారని, భక్తుల మధ్య సమస్య తలెత్తేలా చేశారని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మందలించారు. ఎల్లమ్మ కల్యాణోత్సవంలో అవాంఛనీయ ఘటనలపై మంగళవారం సాయంత్రం మంత్రి సురేఖ సంబంధిత ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. 

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, అడిషనల్ సీపీ(లా అండ్ ఆర్డర్) విక్రంసింగ్ మాన్, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, రాష్ట్ర స్థాయి బోనాల కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బోనాల ఉత్సవాల్లో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా రాజకీయ ప్రేరేపిత అరాచక శక్తులు శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు పన్నాగం పన్నాయని మండిపడ్డారు. ఇలా జరగడం కరెక్ట్​కాదన్నారు. విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచేందుకు ఎవరు ప్రయత్నించినా సహించబోమని మంత్రులు స్పష్టం చేశారు.