జైలుకు వెళ్లాకే ఎమ్మెల్సీ కవితకు .. తాళిబొట్టు, రుద్రాక్ష మాల గుర్తుకొచ్చినయ్‍: కొండా సురేఖ

జైలుకు వెళ్లాకే ఎమ్మెల్సీ కవితకు .. తాళిబొట్టు, రుద్రాక్ష మాల గుర్తుకొచ్చినయ్‍: కొండా సురేఖ
  • పదేండ్లలో ఆమె మెడలో తాళిబొట్టు చూడలే
  • ఫోన్‍ ట్యాపింగ్​లో ఉన్నాడు కాబట్టే కేటీఆర్‍లో ఫ్రస్టేషన్‍ 
  • అమెరికా పారిపోయిన ఆఫీసర్లు కాళ్లబేరానికి వస్తున్నరు
  • కేటీఆర్‍ లీగల్‍ నోటీసులకు భయపడేది లేదు
  • మంత్రి  కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు : కేసీఆర్‍ కూతురు కల్వకుంట్ల కవితకు తీహార్‍ జైల్‍కు వెళ్లాకే తాళి, రుద్రాక్ష జపమాల గుర్తుకొస్తున్నాయని.. పదేండ్లలో ఆమె మెడలో తాను ఏనాడూ తాళి చూడలేదని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం గ్రేటర్‍ వరంగల్‍ హనుమకొండలోని కాంగ్రెస్‍ భవన్‍లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందరరెడ్డి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి అధ్యక్షతన వరంగల్‍ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రెస్‍మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. కేటీఆర్‍ ఫోన్‍ ట్యాపింగ్‍ కేసులో ఉన్నాడు కాబట్టే భయపడి ఫ్రస్టేషన్‍ అవుతున్నాడన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఉండి అమెరికా పారిపోయిన ఆఫీసర్లంతా కాళ్లబేరానికి వస్తున్నట్లు చెప్పారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. కేటీఆర్‍ ఇష్టారీతిన రేవంత్‍రెడ్డిపై నోరు పారేసుకుంటే తాను రిటర్న్​కౌంటర్‍ ఇచ్చానని..ఆయన నోటీసులు ఇస్తామంటే భయపడే ప్రసక్తి లేదన్నారు. తప్పకుండా వాటికి సరైన సమాధానం చెప్తామన్నారు. తెలంగాణలో భాష వక్రీకరణ చేసిందే కేసీఆర్‍, ఆయన కుటుంబ సభ్యులన్నారు. 

వారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. లిక్కర్‍ కేసులో కవిత, ఫోన్‍ ట్యాపింగ్‍ కేసులో కేటీఆర్‍ పేరు ఉండటంతో కేడర్‍లో బీఆర్‍ఎస్‍ పరువు పోతుందన్నారు. దక్షిణాది ప్రాంతాల్లో..అందులోనూ తెలంగాణలో బీజేపీకి అస్సలు ఆదరణ ఉండదన్నారు. మరోసారి రేవంత్‍రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్‍ విజయం సాధించబోతున్నట్లు చెప్పారు. రాహుల్‍గాంధీ సైతం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పార్లమెంట్‍ ఇన్​చార్జి రేవూరి, జిల్లా అధ్యక్షుడు నాయిని మాట్లాడుతూ ఈ నెల 6న హైదరాబాద్‍ తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్‍ బహిరంగ సభకు పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ఇదే తుక్కుగూడ సభ కేంద్రంగా ప్రకటించామని..అదే సెంటిమెంట్‍తో కాంగ్రెస్‍ పార్టీ జాతీయ స్థాయి మెనిఫెస్టో ప్రకటించబోతున్నట్లు వివరించారు. వర్ధన్నపేట, స్టేషన్‍ ఘన్‍పూర్‍, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కేఆర్‍.నాగరాజు, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణతో పాటు నేతలు ఎర్రబెల్లి స్వర్ణ, బంక సరళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‍ పార్టీలో చేరిన కడియంను కొండా సురేఖ, ఎమ్మెల్యేలు సన్మానించారు.