హైదరాబాద్: నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆమె మరోసారి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొండా సురేఖ ట్వీట్ చేశారు.
‘‘నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు. నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా వారి పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే చింతిస్తున్నాను. నాగార్జున ఫ్యామిలీపై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.
వివాదం ఏంటంటే..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సినీ నటుడు అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్‌మీడియా లింక్స్‌తో నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువునష్టానికి సంబంధించి బీఎస్‌ఎస్ 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో ప్రస్తుతం విచారణ నడుస్తోంది.
2025, నవంబర్ 13న ఈ పిటిషన్‌పై కోర్టులో మరోసారి విచారణ జరగనుంది. కోర్టులో విచారణకు ఒక్కరోజు ముందు నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరీ.. ఈ ఇష్యూపై నాగార్జున ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పడంతో నాగార్జున కేసు విత్ డ్రా చేసుకుంటారా..? లేదా అనేది చూడాలి.
