అడవుల్లో ఇంటర్​నెట్ కనెక్టివిటీ పెంచాలి

అడవుల్లో ఇంటర్​నెట్ కనెక్టివిటీ పెంచాలి
  •     వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ
  •     ఫైబర్ కనెక్టివిటీ, 4జీ టవర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  •     19 ప్రతిపాదనలకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: అటవీ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచినట్టే.. వన్యప్రాణుల సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో సెల్​ఫోన్ కనెక్టివిటీ పెంచేందుకు వచ్చిన 19 ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఆమోదించిందన్నారు. ఇందులో 4జీ టవర్ల ఏర్పాటు కూడా ఉందన్నారు. మంగళవారం సెక్రటేరియెట్​లో స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లోని ఆవాసాలకు టీ ఫైబర్ కనెక్టివిటీ కల్పించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించామని తెలిపారు. దీని ద్వారా కవ్వాల్ టైగర్ రిజర్వ్, తాడోబా టైగర్ రిజర్వ్ మధ్య కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటవుతున్నదని చెప్పారు. పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో మొత్తం 1,492 చదరపు కిలో మీటర్ల పరిధిలో కన్జర్వేషన్ రిజర్వ్ రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. వన్య ప్రాణుల దాడుల్లో చనిపోయిన వారికిచ్చే నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. ప్రత్యేక సందర్భాల్లో ఏనుగుల వినియోగంపై త్వరలో విధివిధానాలు రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. 

ALSO READ: బీజేపీ రథయాత్రలు మళ్లీ వాయిదా

పాము కాటుతో మరణిస్తే పరిహారం!

పాము కాటుతో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.