ఉచిత విద్యను అందించాలనే గురుకులాలు

ఉచిత విద్యను అందించాలనే గురుకులాలు

మానవ జీవితంలో విద్యను మించినది మరొకటి లేదని, దీంతోనే వికాసం ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం తద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గండిపేట మండలం నార్సింగిలో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన తుంబి (తూనీగ) అనే పిల్లల మాస పత్రికను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించాలనే ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని వివరించారు. గురుకులాలలో చదువుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలబాలికలు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండడం, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండడం సంతోషకరమన్నారు. మహనీయుల జీవిత చరిత్రలు, విజయగాధలు, నీతి కథలు, పెయింటింగ్స్, కార్టూన్స్‌తో కూడిన ఈ తుంబి మాస పత్రిక వంటి మ్యాగజైన్‌ను మన గురుకుల విద్యార్థుల కోసం కూడా తీసుకువస్తే బాగుటుందన్నారు. 

మనిషి ప్రకృతితో కలిసి ముందుకు సాగాలని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యతను ఈ తుంబి గుర్తు చేస్తుందని మంత్రి కొప్పుల అన్నారు. తుంబి పత్రిక పుస్తక పఠనాన్ని, భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు దోహద పడుతుందన్నారు. బాలబాలికలలో నిగూడమై ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు గాను తమిళనాడుకు చెందిన శివరాజు (శివన్న) తుంబి మాస పత్రికను తీసుకొస్తున్నారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ విద్యార్థులు కలిసి భోజనం చేశారు.