మధ్యంతర పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

మధ్యంతర పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
  • తుది వాదనలు వినాల్సిందేనని తేల్చిన కోర్టు
  • మూడేండ్లు విచారణ జరిగాక ఎలా కొట్టేస్తామని వ్యాఖ్య
  • తుది తీర్పుపై మంత్రి అనుచరుల్లో ఉత్కంఠ

హైదరాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి, జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. 

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై మూడేండ్లపాటు విచారణ జరిగిన తర్వాత, అడ్వొకేట్ కమిషన్ ను నియమించి అక్కడ కూడా వాదనలు ముగిశాక ఎలా కొట్టేస్తామని ప్రశ్నించింది. కచ్చితంగా తుదివాదనలు వినాల్సిందేనని కామెంట్ చేసింది. 

వివాదం ఇది

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్ అభ్యర్ఙిగా బరిలోకి దిగారు. మంత్రికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణకుమార్ నిలిచారు. నువ్వానేనా అన్నట్టుగా జరిగిన ఈ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ 441 ఓట్ల మెజార్టీతో తెలుపొందారు. 

సరిగ్గా లెక్కించకుండా గెలిచినట్లు ప్రకటించారని, తనకు అనేక అనుమానాలున్నాయని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొప్పుల ఈశ్వర్ ఓటమి భయంతోనే గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగడంతో అనేక ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో పోటీ పడ్డారని, అయినప్పటికీ చివరి నిమిషంలో ఓడిపోతారని భయంతో అధికారుల అండ చూసుకుని తప్పుడు మార్గంలో గెలిచారని ఆరోపించారు. 

వీవీ ప్యాట్ల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించక ముందే అధికారులు కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించారని లక్ష్మణ కుమార్ ఆరోపించారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటింగ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను, సీసీ టీవీ ఫుటేజీలను అందించాలని ఆదేశించింది. జగిత్యాల కలెక్టర్ స్ట్రాంగ్ రూం తాళాలు తెరిచేందుకు యత్నించగా కీ కనిపించలేదు. దీంతో పిటిషనర్ మరోమారు కోర్టు మెట్లెక్కగా తాళాలు పగులగొట్టి పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. 

సుప్రీంకోర్టులోనూ సేమ్ సీన్

తన ఎన్నికపై దాఖలైన పిటిషన్ విచారణ కొట్టేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 28వ తేదీన ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురైంది. 

దీంతో ఆయన మళ్లీ హైకోర్టు గడప తొక్కారు. గత నెల 30న మంత్రి కొప్పుల అడ్వొకేట్ కమిషన్ ముందు విచారణకు హాజరై వివరాలు అందించారు. ఇవాళ మంత్రి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ పై విచారణ సాగింది. 

మూడేండ్ల పాటు విచారణ జరిగిన తర్వాత, అడ్వొకేట్ కమిషన్ ముందు వాదనలు జరిగాక కేసును కొట్టేయలేమని, తుదివాదనలు వినాల్సిందేనని పేర్కొంటూ మంత్రి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే టెన్షన్ మంత్రిని వెంటాడుతోంది.