మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు ఆమోదం తెలపండి: మంత్రి కేటీఆర్

మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు ఆమోదం తెలపండి: మంత్రి కేటీఆర్
  • కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌‌కు కేటీఆర్‌‌‌‌ వినతి
  • మరో 20 లక్షల టన్నుల 
  • పారా బాయిల్డ్‌‌ రైస్‌‌కు అనుమతివ్వాలని గోయల్‌‌కు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని మంత్రి కేటీఆర్ కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. దాదాపు 7 అంశాలపై విజ్ఞప్తులను ఆయనకు కేటీఆర్ అందించారు. ల‌‌క్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వ‌‌ర‌‌కు 26 కిలోమీట‌‌ర్లు, నాగోల్ నుంచి ఎల్‌‌బీన‌‌గ‌‌ర్ వ‌‌ర‌‌కు 5 కిలోమీట‌‌ర్ల మెట్రో లైన్‌‌కు ఆమోదం తెలిపాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక స‌‌హాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో నివసించే పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ ప్రోగ్రామ్‌‌ను అమలు చేయాలన్న ప్రతిపాదనను స‌‌మ‌‌ర్పించారు.

హైదరాబాద్ సిటీలో చెత్త శుద్ధితో పాటూ చెత్తను తరలించేందుకు అవసరమైన వాహనాల కొనుగోలు, ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ స్టేషన్ల నిర్మాణం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ లేదా ఇతర సెంట్రల్ స్పాన్సర్ స్కీం (సీఎస్ఎస్) కింద రూ.400 కోట్లు ఇవ్వాలని కోరారు. రూ.3,050 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి 15 శాతం నిధులను అందించాలని విజ్ఞప్తి చేశారు.

పారా బాయిల్డ్ రైస్ కోటా పెంచండి

తెలంగాణ నుంచి అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) పారా బాయిల్డ్‌‌ రైస్‌‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను మంత్రి కేటీఆర్ కోరారు. వాణిజ్య భవన్ లో ఎంపీలతోపాటు వెళ్లి కేంద్ర మంత్రిని కేటీఆర్ కలిశారు. 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో పారాబాయిల్డ్ రైస్, మెగా టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఆర్థిక సహకారం అందించాలని కేటీఆర్ కోరగా... ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ పార్క్ లకు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణ లోని మెగా టెక్స్ టైల్ పార్క్ బ్రౌన్ ఫీల్డ్ లోకి వస్తుందని తెలిపారు. 

చూద్దాం.. చేద్దాం.. అన్నరు: కేటీఆర్

తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రులు చూద్దాం.. చేద్దాం అన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం తీరుపై నమ్మకం లేదని చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ ప్రొగ్రామ్‌‌పై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించినట్లు చెప్పారు. ఈ నమూనాను, ఆలోచనలను తొలుత తమతో పంచుకోవాలని కేంద్ర మంత్రి కోరినట్లు తెలిపారు. తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసే మీటింగ్ లో ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.