దేశంలోకెల్లా తెలంగాణ లోనే ఎక్కువ జాబ్‌లు ఇచ్చినం : కేటీఆర్‌‌

దేశంలోకెల్లా తెలంగాణ లోనే ఎక్కువ జాబ్‌లు ఇచ్చినం : కేటీఆర్‌‌
  •  అలాంటి రాష్ట్రం ఇంకోటి చెప్పు రాహుల్‌: కేటీఆర్‌‌
  • జాబ్‌ క్యాలెండర్‌‌ పేరుతో నిరుద్యోగులను ఫూల్స్‌ చేస్తున్న కాంగ్రెస్‌ 
  • రాహుల్ బలహీనతే మోదీకి పెద్ద అస్సెట్ 
  • కర్నాటకలో అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ 
  • నడిపేటోళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నరని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేశామని, అలాంటి రాష్ట్రం ఇంకోటి ఉంటే చెప్పాలని రాహుల్‌ గాంధీకి  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్‌ చేశారు. 2014 నుంచి రాహుల్ గాంధీ రాజకీయ నిరుద్యోగి అని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌‌ మాట్లాడారు. తమ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో ఇచ్చిన ఉద్యోగాల లెక్కను రాహుల్‌కు పంపిస్తామని, చదువుకోవాలని సూచించారు. 

కర్నాటకలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2.50 లక్షల ఉద్యోగాలిస్తామని, మొదటి కేబినెట్‌లోనే దీనిపై సంతకం చేస్తామని ఎన్నికల ప్రచారంలో రాహుల్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్ చేస్తోందని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎలా నోటిఫికేషన్​ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తన ఉద్యోగం కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 

బీజేపీని నిలువరించేది కేసీఆరే..

తెలంగాణలో బీజేపీని నిలువరించే శక్తి కేసీఆర్‌‌కు, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందని కేటీఆర్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో దీదీ, ఢిల్లీలో కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలే బీజేపీని అడ్డుకున్నారు.. తప్ప కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల్లో సులభంగా ఆ పార్టీ అధికారం చేజిక్కించుకుందన్నారు. రాహుల్ గాంధీ బలహీనతే మోదీకి పెద్ద అస్సెట్ అన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు కర్నాటక ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. 

కర్నాటకలో అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ నడిపేటోళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ 5 గంటల కరెంట్, రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ అంటున్నారని.. అందుకే కాంగ్రెస్ కావాలో.. కరెంట్‌ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్తున్నామన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు వేస్తే రేవంత్ రెడ్డికి అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం పీఎం కిసాన్ డబ్బులు వేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ది ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ అని, బీజేపీతో ఆయనకు లోపాయకారి ఒప్పందాలున్నాయని ఆరోపించారు. అందుకే గోషామహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. యూసీసీని తాము బాహాటంగానే వ్యతిరేకించామని గుర్తుచేశారు .

మా వాళ్లపైనా ఈడీ దాడులు..

రాహుల్ గాంధీ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్​అయితే.. రేవంత్ రెడ్డి బార్న్ విత్ బ్లాక్ మెయిల్ అని కేటీఆర్‌‌ ఎద్దేవా చేశారు. రాహుల్‌ మొదట అమేథిలో, యూపీలో గెలిచిన తర్వాత మిగతా ప్రాంతాలకు వెళ్తే మంచిదన్నారు. యూపీ సీఎం యోగి తన సొంత రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకోవాలని సూచించారు. 

కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేస్తే గగ్గోలు పెట్టారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా ఈడీ దాడులు జరగడం లేదా అని ప్రశ్నించారు. ఒక్క బీజేపీ నేతలపై మాత్రమే ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదన్నారు. తనకు ఎన్నికల కమిషన్ నోటీసులిచ్చిందని, వాటికి సమాధానం చెప్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్​రెడ్డి, రాజేశ్వర్​రావు తదితరులు పాల్గొన్నారు.

దీక్ష దివస్​ ఘనంగా నిర్వహించండి..

తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన ఈ నెల 29న దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 14 ఏళ్లుగా దీక్ష దివస్‌ను నిర్వహిస్తున్నామని, ఈసారి అదే స్ఫూర్తితో 29న ఉద్యమకారులను సత్కరించాలని, అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేయాలని సూచించారు. 2009 నవంబర్​29న ‘కేసీఆర్​సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’అని కేసీఆర్ కరీంనగర్ నుంచి సిద్దిపేటకు ఆమరణ నిరాహార దీక్షకు బయల్దేరారని, ఆయనను అల్గునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలిస్తే యావత్ తెలంగాణ ఒక్కటై ఉద్యమించిందని గుర్తుచేశారు. 

కేసీఆర్ అరెస్టును వ్యతిరేకిస్తూ శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేసుకున్నారని, ఆ తర్వాత ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల్లోనూ దీక్ష దివస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకులను కోరారు.