ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఎదుర్కొనేందుకు రెడీ

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఎదుర్కొనేందుకు రెడీ

కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమపై వేట కుక్కల్లా ప్రయోగిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తమపై ఈడీ దాడులు జరుగుతాయని చెప్పారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  

బీజేపీని నడుపుతున్న గుజరాతీలు 

దేశంలో రాజకీయ శూన్యత ఉందన్న కేటీఆర్.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్కు ఫుల్ క్లారిటీ ఉందని చెప్పారు. తమ టార్గెట్ 2024 లోక్ సభ ఎలక్షన్స్ అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పార్టీ పేరు మార్చామని అప్పటిలోగా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు. బీజేపీ గురించి దేశ ప్రజలకు తెలుసని, అది జాతీయ పార్టీ అయినా దాన్ని గుజరాతీలు నడుపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తమకు సమయం ఇస్తే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు చేస్తామని స్పష్టంచేశారు. గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అన్న కేటీఆర్.. తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

తెలంగాణలో కలపాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, ఇంటింటికీ తాగు నీరు, దళిత బంధు తదితర కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని కేటీఆర్ చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు మద్దతు పెరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. 

టచ్లో ఉన్న కాంగ్రెస్ నేతలు
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. ఇక దేశంలో 10వేల మంది మొబైల్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న ఆయన.. కిషన్ రెడ్డి ఫోన్ నెంబర్ కూడా అందులో ఉందని చెప్పారు. సుజనా చౌదరి, సీఎం రమేష్పై ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.