
- రోజ్‌గార్ మేళా పచ్చిదగా
- మోడీ కొత్త డ్రామాకు తెరతీసిండు: మంత్రి కేటీఆర్
- నమో అంటే నమ్మించి మోసం చేసుడేనని రుజువైందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: పది లక్షల మందికి ఉద్యోగాల పేరుతో నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళా పచ్చి మోసమని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని ఈ మేళాతో మరోసారి రుజువయ్యిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ముందు మోడీ కొత్త డ్రామాకు తెరతీశారని, యువత జీవితాలతో చలగాటమాడటం మానుకొని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, 16 కోట్ల ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఏటా నిరుద్యోగం పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో రోజ్‌గార్ మేళా పేరుతో ఆటలాడటం సరికాదన్నారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్న హామీని 10 లక్షలకు కుదించారని, అందులో 75 వేల మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారని ఆక్షేపించారు. ప్రధాని మోడీ పాలనా వైఫల్యం, అడ్డగోలు ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 9న తాను రాసిన లేఖకు ఇప్పటికీ సమాధానం రాలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా రోజ్‌గార్ మేళా పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బాత్ కరోడోమే.. కామ్ పకోడోమే అన్నట్టుగా కేంద్రం తీరు ఉందని ఎద్దేవా చేశారు.