కామన్ ​మ్యాన్ ​ప్రభుత్వం కాదు.. కార్పొరేట్ సర్కారు : మంత్రి కేటీఆర్

కామన్ ​మ్యాన్ ​ప్రభుత్వం కాదు.. కార్పొరేట్ సర్కారు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్​మ్యాన్​ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. పెట్రోల్, డీజిల్​పై అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్​ డ్యూటీ, సెస్సులు, పన్నులను తగ్గించకుండా.. విండ్​ ఫాల్ ట్యాక్స్​పేరిట ఆయిల్​ కంపెనీలకు పన్నులను తగ్గించిందని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కార్పొరేట్లకు వరాలిచ్చి సామాన్యులపై భారం మోపడమే బీజేపీ సర్కార్​ పాలసీ అన్నారు. ఈ కార్పొరేట్​కంపెనీలు సంపాదించిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుందో అందరికీ తెలుసన్నారు. రష్యా, ఉక్రెయిన్​యుద్ధం వల్లే దేశంలో పెట్రోల్​, డీజిల్​ రేట్లు పెరిగాయని చెప్తూ.. ప్రజలను బీజేపీ ప్రభుత్వం దోచుకున్నదన్నారు.

మోడీ మిత్రులకు చెందిన 2 కార్పొరేట్ ​కంపెనీలకు మేలు చేసేందుకే విండ్​ఫాల్ ట్యాక్స్​ను తగ్గించిందన్నారు. రష్యా నుంచి తక్కువ రేటుకు ఆయిల్​ను కొనడం వల్ల దేశంపై రూ.35 వేల కోట్ల భారం తగ్గిందంటూ కేంద్రం చెప్పిందని.. మరి, ఆ లాభం ఒకట్రెండు కంపెనీలే వెనకేసుకున్నాయా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్​పై 2014 నుంచి రాష్ట్ర సర్కార్​ వ్యాట్​ను పెంచకున్నా.. తగ్గించడం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు.