అవినీతిలో రెవెన్యూ తర్వాత మున్సిపల్‌ శాఖే ముందున్నది

V6 Velugu Posted on May 14, 2022

హైదరాబాద్‌, వెలుగు: కౌన్సిల్‌ సమావేశాలకు మీడియా రాకుండా కమిషనర్లు చర్యలు చేపట్టాలంటూ మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు. మీటింగ్ తర్వాత మీడియాకు మనమే బ్రీఫింగ్ ఇవ్వాలని సూచించారు. కరీంనగర్‌లో డైలీ నీళ్లు సరఫరా చేస్తున్నామని, అయినా కౌన్సిల్‌ మీటింగ్‌లో ఒకామె నీళ్లు రావడం లేదని బిందెతో నిరసన తెలిపితే మీడియాకు అదే పెద్ద వార్త అయ్యిందని మండిపడ్డారు. కౌన్సిల్‌ సమావేశాలు నడిపే తీరు ఇది కాదని అసహనం వ్యక్తం చేశారు. 

కౌన్సిల్‌‌ మీటింగుల్లో కెమెరాలు పెడితే సిటీ కేబుల్‌‌లో, మీడియాలో వార్తల కోసం హంగామా చేసే బ్యాచ్‌‌ ఒకటి ఉంటుందని, వాళ్ల వార్తలే ప్రధానంగా వస్తాయని అన్నారు.  శుక్రవారం హైదరాబాద్‌‌ వెంగళరావు నగర్‌‌లోని టీఎస్‌‌ జెన్‌‌కో ఆడిటోరియంలో మేయర్లు, మున్సిపల్‌‌ చైర్మన్లు, కమిషనర్లతో నిర్వహించిన పట్టణ ప్రగతి సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. అవినీతిలో రెవెన్యూ శాఖ తర్వాత మున్సిపల్‌‌ శాఖే ముందుందని, ప్రభుత్వం సర్వే చేస్తే ఈ విషయం తేలిందని కేటీఆర్‌‌ అన్నారు. మున్సిపల్‌‌ చట్టానికి ఎవరూ అతీతులు కాదని, కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టం అమలులో లోపాలు జరిగితే ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు.లంచాలు లేకుండా బిల్డింగ్‌‌ పర్మిషన్‌‌ ఇస్తారని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా పని చేయాలని సూచించారు.

సిబ్బందిని నియమించలే.. ఉన్నోళ్లపై అరవొద్దు

ఈనెల 20 నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతానికి అందరూ కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. పల్లెలే కాదు పట్టణాలు కూడా బాగున్నాయని సీఎం కేసీఆర్‌‌తో చెప్పించుకునేలా అందరూ పనిచేయాలన్నారు. ‘‘కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినా డిపార్ట్‌‌మెంట్‌‌కు అవసరమైన సిబ్బందిని నియమించలేదు. పని ఒత్తిడి ఉన్నా కష్టపడి పనిచేస్తున్న వారిపై ప్రజాప్రతినిధులు అరవడం సరికాదు. అట్లా చేస్తేనే పనులు అవుతాయనే పద్ధతి మానుకోవాలి. 24 గంటలు చాకిరీ చేసేది ఒక్క మున్సిపల్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ మాత్రమే. పట్టణాలను శుభ్రంగా ఉంచినా తిట్లు పడేది కూడా ఈ డిపార్ట్‌‌మెంట్‌‌కే. ఇది థ్యాంక్స్‌‌ లెస్‌‌ జాబ్‌‌. మనం చేసిన పనికి ఎవ్వరూ ప్రచారం చేయరు. ఏటా ఆయా మున్సిపాలిటీలో చేసిన పనులపై వార్షిక నివేదిక తయారు చేసి ప్రజల ముందుంచాలి” అని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌‌ వెజ్‌‌, నాన్‌‌వెజ్‌‌ మార్కెట్లు నిర్మించాలని, ప్రతి ఇంటికీ నల్లాలతో తాగునీళ్లు అందించాలన్నారు. పట్టణాలు, నగరాల్లో బయోమైనింగ్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

వార్డ్‌‌ ఆఫీసర్లను నియమిస్తం 

మున్సిపాలిటీల్లోని 3,618 వార్డులకు గాను ప్రతి 50 వేల మందికి ఒక వార్డ్‌‌ ఆఫీసర్‌‌ను నియమిస్తామని, డిపార్ట్‌‌మెంట్‌‌లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని కేటీఆర్ చెప్పారు. ‘‘ప్రజలు కట్టిన ప్రతి పైసాకు మనం పనిచేసి చూపించాలి. అన్ని మున్సిపాలిటీలు ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే పనులకు సంబంధించి మాస్టర్‌‌ ప్లాన్‌‌ రూపొందించుకోవాలి. ప్రతి మున్సిపాలిటీలో సివరేజీ ట్రీట్‌‌మెంట్‌‌ ప్లాంట్లు నెలకొల్పాలి” అని సూచించారు. రాష్ట్రానికి సమకూరే ఆదాయంలో సగానికి పైగా పట్టణాల నుంచే వస్తుందని తెలిపారు. గ్రామాల నుంచి ఉపాధి, విద్య, వైద్యం కోసం పట్టణాలకు వస్తున్నారని, వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్య గణనీయంగా పెంచామని, రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందన్నారు. శానిటేషన్‌‌, ఓడీఎఫ్‌‌ సర్టిఫికేషన్‌‌, రెవెన్యూ ఇంప్రూవ్‌‌మెంట్‌‌, ఇన్నోవేటివ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌, హరితహారంలో ముందున్న మున్సిపాలిటీలకు ఉత్తమ
 అవార్డులు ప్రదానం చేశారు.

మేం కడుపు నింపుతుంటే.. మా కడుపు కొడుతున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా తాను సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌‌ చేస్తూ శుక్రవారం ఓపెన్‌‌ లెటర్‌‌ రాశారు. తాము కేంద్రం కడుపు నింపుతున్నా.. తమ కడుపు కొట్టడం మానలేదని మండిపడ్డారు. ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. పత్తా లేకుండా పోవుడు బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, అదే గుజరాత్‌‌కు ఇవ్వని హామీలను ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతమో చెప్పాలని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై తెగేదాకా కొట్లాడటం తమ బాధ్యతని స్పష్టం చేశారు. తెలంగాణపై ఇలాగే సవతి తల్లి ప్రేమ కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి 27 ప్రశ్నలు సంధించారు.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి

విభజన చట్టంలో హామీ ఇచ్చిన రైల్వే కోచ్‌‌ ఫ్యాక్టరీ ఇవ్వకపోగా.. రూ.20 వేల కోట్లతో గుజరాత్‌‌లో ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఐఐఎం, ఐఎస్‌‌, ఎన్‌‌ఐటీ, ట్రిపుల్‌‌ ఐటీ, ట్రైబల్‌‌ వర్సిటీ, నవోదాయ విద్యాలయాలు తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో నంబర్‌‌ వన్‌‌గా ఉన్న రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వలేదని, ఐటీఐఆర్‌‌ను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రానికి సాఫ్ట్‌‌వేర్‌‌ టెక్నాలజీ పార్కులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్‌‌ హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చలేదని చెప్పారు. కృష్ణాలో రాష్ట్రానికి 575 టీఎంసీల వాటా దక్కాలని కోరుతున్నా, ట్రిబ్యునల్‌‌కు రిఫర్‌‌ చేయకుండా 8 ఏళ్లుగా జాప్యం చేస్తున్నారని, స్కై వేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు ఇవ్వట్లేదని, మూసీ ప్రక్షాళనకు పైసా కేటాయించలేదని, గుజరాత్‌‌కు వేల కోట్ల వరద సాయం చేసి హైదరాబాద్‌‌ను విస్మరించారని గుర్తు చేశారు. ఫార్మాసిటీకి సాయం చేయట్లేదని, ఇకో సిస్టం లేని చోట డిఫెన్స్‌‌ కారిడార్‌‌ ఇచ్చి.. ఏరో స్పేస్‌‌, డిఫెన్స్‌‌ సంస్థలు ఉన్న తెలంగాణను విస్మరించారన్నారు. టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌, మెగా పవర్‌‌ లూం క్లస్టర్‌‌ ఏర్పాటు చేయడం లేదన్నారు. పంజాబ్‌‌లో మాదిరే తెలంగాణలో వడ్లు కొనడం లేదని, పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని, ప్రజల నడ్డి విరిచేలా పెట్రో ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. పెట్రో ధరల పెంపునకు కారణమైన సెస్సులు రద్దు చేయాలన్నారు. అమిత్‌‌ షా తన పర్యటనలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌‌ చేశారు.
 

Tagged Karimnagar, WATER, Minister KTR, Media, Mayors, Council meeting, City cable, municipal chairmen

Latest Videos

Subscribe Now

More News