కేంద్రంపై కేటీఆర్​ ఫైర్

కేంద్రంపై కేటీఆర్​ ఫైర్

హైదరాబాద్, వెలుగు : గ్రామాలకు, పట్టణాలకు కేంద్రం అవార్డులు ఇస్తుందని, తిరిగి పరిపాలన బాలేదని కేంద్ర ప్రభుత్వ నేతలే విమర్శిస్తారని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అలాంటి విమర్శలు పట్టించుకోవద్దని కేంద్రం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్న మున్సిపల్ చైర్మన్లకు, కమిషనర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. మంగళవారం జూబ్లీహిల్స్  ఎంసీహెచ్ఆర్డీలో అవార్డు గ్రహీతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఆయన అభినందించి మాట్లాడారు.

20 బెస్ట్ గ్రామాల్లో  19  తెలంగాణ గ్రామాలే  ఉన్నాయని కేంద్రం చెబుతున్నదని, పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తే దేశంలో రెండో స్థానంలో మన రాష్ట్రం నిలిచిందన్నారు. కింది స్థాయిలో ఉన్న శానిటేషన్ వర్కర్  నుంచి మున్సిపల్ స్పెషల్ సీఎస్ వరకు అందరూ కలిసి కలిసి పనిచేయడం వల్లే  అవార్డులు వచ్చాయని తెలిపారు. రాష్ర్టంలో స్థానిక సంస్థల విధులను నిర్ణయించడం, నిధులు మంజూరు చేయడం వల్లే ఇంత ప్రగతి సాధ్యమైందన్నారు. ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19  మున్సిపాలిటీలకు రూ.2  కోట్ల చొప్పున  ప్రోత్సాహం ప్రకటించారు.  ఆ నిధులను ప్రత్యేకంగా శానిటేషన్  కోసం వినియోగించాలన్నారు.  

ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై స్పందిస్తామని, రాష్ట్ర శానిటేషన్ నిర్వహణ  కార్యక్రమాలపై సమగ్రంగా సమాచారం అందిస్తామన్నారు. ట్రిబ్యునల్ కు కొంత సమాచార గ్యాప్ ఉందని మంత్రి పేర్కొన్నారు.