
భాగ్యనగరంలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. SRDP పథకంలో భాగంగా మూడు కిలోమీటర్ల ఈ ఫ్లైఓవర్ ను రూ. 263 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. ఫ్లైఓవర్ నిర్మాణంతో కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంత వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బొటానికల్ గార్గెన్, కొత్తగూడ ,కొండాపూర్ జంక్షన్ లను కలిపేలా కొత్తగూడ ఫ్లైఓవర్ ను నిర్మించారు. గచ్చిబౌలి నుండి మియాపూర్ వరకు...ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీకి ఈ ఫ్లైఓవర్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ కు అనుబంధంగా అండర్ పాస్ ను కూడా నిర్మించారు.
50 ఏండ్ల పాటు నీటి సరఫరా
హైదరాబాద్లో రహదారులు ,మౌలిక సదుపాయాలు, డ్రైనేజీల విస్తరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే 50 ఏండ్లకు సరిపడేలా హైదరాబాద్ కు కాళేశ్వరం, సుంకిశాల మంచినీటి సరఫరాను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గతేడాది వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి స్ట్రాటజిక్ నాలా కార్యక్రమం పూర్తిచేస్తామని చెప్పారు. వంద శాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. దీంతో దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ సిటీగా హైదరాబాద్ అవతరించబోతున్నదని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తిచేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే మూడేండ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నామని అన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోను మూడేళ్ళలో పూర్తి చేస్తామన్నారు.