కరీంనగర్ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల గుండెలు గుభేల్ మంటున్నాయి : కేటీఆర్

కరీంనగర్ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల గుండెలు గుభేల్ మంటున్నాయి : కేటీఆర్

రూ.224 కోట్లతో నిర్మించిన కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం (జూన్ 21న) ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు. సమీకృత కూరగాయల మార్కెట్‌కు, గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశ మందిరం, పౌరసేవా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. 

గంగులపై ప్రశంసల జల్లు

మంత్రి గంగుల కమలాకర్ ను సీఎం కేసీఆర్.. కరీంనగర్ భీముడు అంటారని, ఆయన పట్టుబడితే ఏ పనైనా అయ్యేదాకా వదిలిపెట్టరని మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల గుండెలు గుభేల్ మంటున్నాయన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ తొలిదశ పనులు ఆగస్టు నాటికి పూర్తవుతాయని చెప్పారు. మానేరు సజీవ నదిగా మారబోతోందన్నారు. గంగుల కృషితో కరీంనగర్ సర్వాంగ సుందరంగా మారిందన్నారు. 24 గంటల పాటు తాగునీరు ఇచ్చే తొలి నగరంగా కరీంనగర్ మారబోతోందన్నారు. గంగుల లాంటి నాయకుడు భారతదేశంలో మరొకరు ఉండరని చెప్పారు. 

మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పైనా మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. వినోద్ కుమార్ లాంటి మేధావిని ఓడించి ఎవరిని గెలిపించుకున్నారో (బండి సంజయ్ ) మీకే తెలుసన్నారు. తిరుమల తిరుపతి లాంటి ఆలయాన్ని కరీంనగర్ లో గంగుల నిర్మిస్తున్నాడని చెప్పారు. గుడి, బడి, వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు అన్నీ బాగవుతున్నాయని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. 
పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. పని చేయని నాయకులను చెత్తబుట్టలో వేయాల్సిన బాధ్యత కూడా ప్రజలదే అని వ్యాఖ్యానించారు. 

అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తూ ముందుకు పోతున్నామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలోనే అగ్రభాగంగా కరీంనగర్ ముందుకు దూసుకుపోతోందన్నారు. తెలంగాణ ఉద్యమనాటి స్ఫూర్తిని అందరూ ప్రదర్శించాలన్నారు. ఆనాడు కరీంనగర్ జిల్లా పేరుచెబితే ఎలా గుండె జల్లుమనిపించారో.. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చాటాలన్నారు. ‘‘అభివృద్దే మా కులం, సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం’’ అని వ్యాఖ్యానించారు. మానేరు వేదికగా.. ఇక్కడ బతుకమ్మ ఘాట్ నిర్మిస్తున్నామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా వంతెనపై మానకొండూరు వైపు లైటింగ్ కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.