పదేళ్లలో వరంగల్‌‌.. హైదరాబాద్‌‌ను దాటేస్తది : కేటీఆర్‌‌

పదేళ్లలో వరంగల్‌‌.. హైదరాబాద్‌‌ను దాటేస్తది : కేటీఆర్‌‌
  •      ఐటీ మంత్రి కేటీఆర్​
  •      వరంగల్‌‌ నగరంలో రూ.900 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన

హనుమకొండ/వరంగల్, వెలుగు : భవిష్యత్‌‌ మొత్తం ద్వితీయ శ్రేణి నగరాలదేనని, పదేళ్లలో వరంగల్‌‌ నగరం హైదరాబాద్‌‌ను మించిపోతుందని ఐటీ, మున్సిపల్‌‌ శాఖ మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి నగరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బెంగళూరు వంటి నగరాల్లోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్లేనని, వారంతా ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రేటర్‌‌ వరంగల్‌‌ పరిధిలో రూ. 900 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం కేటీఆర్‌‌ నగరానికి వచ్చారు. ముందుగా మడికొండ ఐటీ పార్క్‌‌లో ఏర్పాటు చేసిన క్వాడ్రాంట్‌‌ టెక్నాలజీస్‌‌ ఐటీ కంపెనీ ఆఫీస్‌‌ను ప్రారంభించారు.

హనుమకొండ బాలసముద్రంలో ఠాణునాయక్‌‌ విగ్రహాన్ని ఆవిష్కరించి హయగ్రీవాచారి గ్రౌండ్‌‌లో బహిరంగ సభకు హాజరయ్యారు. అనంతరం ఆర్‌‌అండ్‌‌బీ గెస్ట్‌‌హౌజ్‌‌ను ప్రారంభించి, ఐటీ టవర్, హనుమకొండ బస్టాండ్, అలంకార్‌‌ జంక్షన్‌‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హనుమకొండలో పోతన ట్రాన్స్‌‌ఫర్‌‌ స్టేషన్‌‌, మోడ్రన్‌‌ లాండ్రీ మార్ట్‌‌, స్మార్ట్​ లైబ్రరీని ప్రారంభించారు. భద్రకాళి బండ్‌‌ సస్పెన్షన్‌‌ బ్రిడ్జి, మ్యూజికల్‌‌ ఫౌంటేయిన్‌‌, ప్లానెటోరియం, మున్నూరుకాపు భవన నిర్మాణానికి శిలాఫలకం వేశారు. ఆ తర్వాత వరంగల్‌‌ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు.

కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌‌ వినయ్‌‌ భాస్కర్‌‌, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌‌ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, మేయర్‌‌ సుధారాణి పాల్గొన్నారు. కాగా పద్మశాలి సంఘం జాతీయ నాయకుడు ఈగ మల్లేశం తూర్పు నియోజకవర్గంలో జరిగిన మీటింగ్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. 

డీపీఆర్‌‌వో కళాకారుల నిరసన

హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌‌లో మంత్రి కేటీఆర్‌‌ మాట్లాడుతుండగా డీపీఆర్‌‌వో కళాకారులు నిరసన చేపట్టారు. సంక్రాంతి, శివరాత్రి, హోలీ, శ్రీరామనవమి వంటి పండుగల టైంలో అనేక ఆలయాల్లో ప్రదర్శనలు ఇచ్చామని, వాటికి సంబంధించి 4,594 మందికి రూ.44.40 లక్షలు రావాల్సి ఉందన్నారు. పెండింగ్‌‌లో ఉన్న బిల్లులు వెంటనే మంజూరు చేయాలంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కళాకారులపై శాయంపేట సీఐ మల్లేశ్‌‌యాదవ్‌‌ సీరియస్‌‌ కావడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అంతకుముందు మడికొండ ఐటీ పార్క్‌‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు కేటీఆర్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనిలేని వాళ్లంతా సంఘాలు పెట్టి రోడ్లపైకి వస్తే వారి మాటలు నమ్మి నిరసనలు చేపట్టడం కరెక్ట్‌‌ కాదన్నారు. ఎన్నికల తర్వాత ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.

ఇండ్లు ప్రారంభించకుండానే వెనక్కి

వరంగల్ తూర్పు నియోజకవర్గం దూపకుంటలో నిర్మించిన 2,200 డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్లను ప్రారంభించకుండానే మంత్రి కేటీఆర్‌‌ వెనుదిరిగారు. కేటీఆర్‌‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కొన్ని ఇండ్లను రెడీ చేశారు. కరెంట్‌‌ సదుపాయం లేకపోవడంతో ఓ నాలుగు ఇండ్లకు జనరేటర్‌‌ సాయంతో పవర్‌‌ సప్లై ఇచ్చారు. కానీ పనులు పూర్తి కాకపోవడంతో ఇండ్లు ప్రారంభించకుండానే మంత్రి సభకు వెళ్లారు. 

 ముందస్తు అరెస్ట్‌‌లు

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్‌‌లో మంత్రి కేటీఆర్‌‌ పర్యటన సందర్భంగా ముందుస్తు అరెస్ట్‌‌లు కొనసాగాయి. బీజేపీ, కాంగ్రెస్‌‌ లీడర్లను శుక్రవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. మరికొందరని గృహనిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్​ లీడర్‌‌ మహ్మద్‌‌ ఆయూబ్‌‌, బీజేపీ లీడర్లు మాట్లాడుతూ సీఎం, మంత్రులు వచ్చిన ప్రతీసారి నాయకులను అరెస్ట్‌‌ చేయడం సరికాదన్నారు. 

ఛాంబర్‌‌ ఆఫ్‌‌ కామర్స్‌‌ మీటింగ్‌‌కు హాజరైన కేటీఆర్‌‌

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్‌‌ ఛాంబర్‌‌ ఆఫ్‌‌ కామర్స్‌‌లో శుక్రవారం జరిగిన మీటింగ్‌‌లో మంత్రి కేటీఆర్‌‌ మాట్లాడారు. బీఆర్‌‌ఎస్‌‌ వచ్చాక మంచి జరిగిందో.. లేదో ఆలోచించుకోవాలని సూచించారు. అనంతరం ఛాంబర్‌‌ ప్రెసిడెంట్‌‌ బొమ్మినేని రవీందర్‌‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌‌ను సన్మానించారు. 

సొసైటీలో లేని జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు

గ్రేటర్‌‌ వరంగల్‌‌ పరిధిలోని రెండు హౌజింగ్‌‌ సొసైటీల్లో లేని వర్కింగ్‌‌ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందిస్తామని మంత్రి కేటీఆర్‌‌ హామీ ఇచ్చారు. యూనియన్ల నేతలు శుక్రవారం కేటీఆర్‌‌ను కలిశారు. సొసైటీల్లో లేని వారి కోసం హసన్‌‌పర్తి మండలం మడిపల్లిలో కేటాయించిన 13 ఎకరాల స్థలానికి సంబంధించిన సర్క్యులర్‌‌ కాపీని సిక్స్‌‌మెన్‌‌ కమిటీ సభ్యులకు అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ప్రెస్‌‌క్లబ్‌‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, సిక్స్‌‌మెన్‌‌ కమిటీ కన్వీనర్‍ బీఆర్‌‌ లెనిన్‍, కో కన్వీనర్‍ బొక్క దయాసాగర్‍, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మస్కపురి సుధాకర్‍ ఉన్నారు.