
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. సోమవారం ఆయన ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ప్రతినిధిగా హాజరు కానున్నారు. కేటీఆర్ తో టీఆర్ఎస్ ఎంపీలూ ఢిల్లీ వెళ్తారు. సిన్హా నామినేషన్ పేపర్లపై వారందరూ సంతకాలు చేస్తారు. అనంతరం పార్లమెంట్ సెక్రటరీ చాంబర్‌లో నామినేషన్ వేసే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించాలని మొదట్లో టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో కాంగ్రెస్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి యశ్వంత్ సిన్హాను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. సీఎం కేసీఆర్‌కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఫోన్ చేసి సిన్హాకు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ లేకుండా పోటీకి దిగితే పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన సూచించారు. పవార్ మధ్యవర్తిత్వంతో సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారు.
అందుకే మద్దతు...
జాతీయ స్థాయిలో ఒంటరి కావొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా భావసారూప్య పార్టీలు తమతో కలిసి వచ్చేందుకు రాష్ట్రపతి ఎన్నికలను వేదికగా చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్న ప్రతిపక్షాల అభ్యర్థి సిన్హాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, మంత్రి కేటీఆర్ ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్లడం ఇది మూడోసారి. గత రెండు పర్యటనల్లో కేంద్ర మంత్రులను కలిసిన కేటీఆర్.. సిన్హా నామినేషన్ అనంతరం అవకాశం ఉంటే కేంద్ర మంత్రులను కలుస్తారని, సాధ్యం కాకపోతే హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తారని టీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు.