కేసీఆర్ ​హ్యాట్రిక్​ కొడ్తరు

కేసీఆర్ ​హ్యాట్రిక్​ కొడ్తరు

సిరిసిల్ల కలెక్టరేట్/ ముస్తాబాద్, వెలుగు: ‘‘నాకు కుల పిచ్చి లేదు. నేను హైదరాబాద్ లో పెరిగిన..కాన్వెంట్ లో చదివిన. రాజకీయాల్లోకి వచ్చాకే కులాలు, మతాల గురించి తెలిసింది. నా కులం అభివృద్ధి, మతం సంక్షేమం. పేదరికానికి కులం, మతం ఉంటుందా?’’ అని మంత్రి కేటీఆర్​ అన్నారు. కులమతాలకు అతీతంగా సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేస్తానని పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్​లో పలు కుల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీసీలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో16 బీసీ గురుకులాలు ఉంటే తెలంగాణలో ప్రభుత్వం119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం త్వరలోనే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో పద్మశాలి, రెడ్డి సంఘాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించి, ఆర్థిక సాయం అందజేశామన్నారు. అలాగే ముదిరాజ్, గౌడ్, గంగపుత్ర, గొల్ల, కుర్మ, మున్నూరు కాపులతో సహా అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తామన్నారు. సమావేశం తర్వాత కుల సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు.

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి

అంతకు ముందు కేటీఆర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘానికి కేటాయించిన నాలుగు ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్డీలు పేరుకే అగ్రవ‌‌ర్ణాలుగా ఉన్నారని, ఆ వర్గంలోనూ చాలా మంది నిరుపేద‌‌లు ఉన్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్​తో సాధ్యమైనంత త్వరగా చర్చించి రెడ్డి కార్పొరేష‌‌న్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

కేసీఆర్ ​హ్యాట్రిక్​ కొడ్తరు

సీఎం కేసీఆర్​మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్​ కొడ్తరని కేటీఆర్ ​అన్నారు. ముస్తాబాద్​ మండల కేంద్రంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. పాడిపంటలు పండించడంలో రైతులు హరిత విప్లవాన్ని, మాంసాన్ని ఎగుమతి చేయడంలో గులాబీ విప్లవాన్ని, పాలను  ఎగుమతి చేయడంలో శ్వేత విప్లవాన్ని , రైతులకు సాగు, ప్రజలకు తాగు నీటిని అందించడంలో నీలి విప్లవాన్ని, ఆయిల్ ఉత్పత్తిలో పసుపు వర్ణ విప్లవాన్ని సాధించిన ఘనత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానిదేనన్నారు. కాగా, మంత్రి కాన్వాయ్ ని అడ్డుకోవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.