కలిసి పని చేయండి

కలిసి పని చేయండి
  • ఉమ్మడి ఖమ్మం నేతలతో మంత్రి కేటీఆర్
  • తుమ్మల, పొంగులేటిని కలుపుకొని పోవాలి
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి
  • సిట్టింగ్‌‌లకే టికెట్లిస్తమన్న ధీమా వద్దు
  • ఈ నెల19న జాతీయ పార్టీ ప్రకటన ఉండొచ్చన్న మంత్రి

ఖమ్మం, ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘పార్టీలో కష్టపడే వారికి, గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు వస్తాయి. సిట్టింగ్‌‌లకు సీటు కన్ఫమ్ అనే ధీమా పెట్టుకోవద్దు. అందరినీ కలుపుకొని సమన్వయంతో పని చేసుకోండి” అని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశంలో​ఆయన మాట్లాడారు. ‘‘తుమ్మల లాంటి అపార అనుభవం ఉన్న నాయకుడిని పార్టీ కోసం ఉపయోగించుకోవాలి. ఓడిపోయినంత మాత్రాన పక్కనపెట్టినట్టు కాదు. తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డిని పార్టీలో కలుపుకొని పోవాలి” అని సూచించారు. ఈనెల 19న జాతీయ పార్టీ ప్రకటన ఉండే అవకాశముందని, ఈలోగా హైదరాబాద్‌‌లో మళ్లీ సమావేశం అవుదామంటూ నేతలకు సమాచారమిచ్చారు. అంతకుముందు మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్‌‌‌‌రావుతో కలిసి కేటీఆర్ ఖమ్మంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఇంట్లో లంచ్ మీటింగ్‌‌లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతలతో ప్రత్యేకంగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలోనూ మంత్రి మాట్లాడారు.

చిచ్చు పెడుతున్నరు..
రాష్ట్రంలో అభివృద్ధిని సహించలేక కొందరు కుళ్లుతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒకరు మతం పేరుతో, మరొకరు కులం పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉన్న 25 కోట్ల మంది ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని, దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఖమ్మంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని, విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు.కాంగ్రెస్‌‌కు 50 ఏండ్లు ప్రజలు అధికారం ఇచ్చారని, అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ అంటే కాలువలు,చెరువులు,రిజర్వాయర్లు అని,నేడు ఏ చెరువు కూడా ఎండిపోకుండా నీళ్లు ఉన్నాయని చెప్పారు. మన తెలంగాణ కడుతున్న పన్నులతో గుజరాత్, బీహార్ లాంటి రాష్ర్టాలు అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్,బీజెపీ ఎంపీలు తెలంగాణ కోసం పార్లమెంట్‌‌లో ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.

మోడీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌‌‌‌కే ఉంది..
మోడీ లాంటి వాళ్లను ఎదుర్కొనే దమ్ము ఒక్క కేసీఆర్‌‌‌‌కే ఉందని కేటీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సొల్లు పురాణం చెప్పేందుకు తప్పా.. దేనికీ పనికి రావని మండిపడ్డారు. రెండు పార్టీలూ ఓట్ల కోసమే చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలు గమనించి సీఎం కేసీఆర్‌‌‌‌కు అండగా నిలవాలని కోరారు. తాను ఖమ్మం వచ్చిన ప్రతిసారి మరిన్ని నిధులు కావాలని మంత్రి అజయ్ అడుగుతారని, తిరిగి వచ్చినప్పుడు ఆ నిధులతో చేసిన అభివృద్ధి చూపుతారని చెప్పారు. ‘‘గతంలో ఎండాకాలం వస్తే నీళ్లు ఉండేవి కావు. కరెంట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్ల కాదు.. ఇందుకు కారణం మంచి పరిపాలనా దక్షత కలిగిన సీఎం కేసీఆరే” అని అన్నారు.