
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ముంబైలో పర్యటిస్తున్నారు. ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో.. సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై వారికి వివరించారు. అలాగే.. టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని కేటీఆర్ చెప్పారు. టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో... హైదరాబాదులో ఒక ఎమ్మార్వో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో తమ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపట్ల టాటా చైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ JSW మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. JSW సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపార విజయవంతమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జిందాల్‌ని కేటీఆర్ కోరారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న చత్తీస్ ఘడ్లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పాలసీల గురించి తమకు అవగాహన ఉన్నదన్న సజ్జన్ జిందాల్, కొన్ని సంవత్సరాలుగా సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కేటీఆర్, fmcg రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఆ తరువాత ఆర్ పిజి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయంకాతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమై, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.