ఆర్టీసీ యూనియన్ల నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ

ఆర్టీసీ యూనియన్ల నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు గుర్తున్నాయని.. వాటిని త్వరలో నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ యూనియన్లు వారి బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారని ఆయన ప్రశంసించారు. మంగళవారం బేగంపేటలోని మినిస్టర్ క్యాంప్ ఆఫీసులో మంత్రి కేటీఆర్-ను, కుందన్ బాగ్-లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్-ను ఆర్టీసీ యూనియన్ నేతలు కలిశారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 2017 పీఆర్సీ ఇవ్వాలని, యూనియన్లకు మళ్లీ అనుమతించాలని కోరారు.2013 పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత  కల్పించాలని, ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తమని ఆర్టీసీ యూనియన్లకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్-ను కలిసిన వారిలో ఆర్టీసీ టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి, ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్, అడ్వైజర్ యాదయ్య, మునుగోడు ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. 

ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇస్తం: బాజిరెడ్డి

ఆర్టీసీ కార్మికులకు త్వరలో పీఆర్సీ ఇస్తామని, సీఎం కేసీఆర్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. మంగళవారం క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కేటీఆర్ ను ఆయన కలిశారు. మునుగోడులో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీకి ఆర్థికంగా  సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలే, మునుగోడు బైపోల్ లో టీఆర్ఎస్ ను గెలిపించాయన్నారు. ఇటీవల ఆర్టీసీకి రూ.100 కోట్లు సాంక్షన్ చేయడం, పెండింగ్ లో ఉన్న 3 డీఏలు, ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వడం సంతోషకరమన్నారు.