రేవంత్.. బీజేపీ కోవర్ట్..  గెలిచిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీలో చేరుతడు: కేటీఆర్

రేవంత్.. బీజేపీ కోవర్ట్..  గెలిచిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీలో చేరుతడు: కేటీఆర్
  • ప్రజలు హ్యాపీగా ఉన్నరు.. ఖద్దరు చొక్కాలోల్లే ఖుషీగా లేరు
  • రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లయితది 
  • రాహుల్​ జీ.. ఓసారికాళేశ్వరం చూసి రండి
  • రాసిచ్చిన స్క్రిప్ట్​లనే ఆయన చదువుతున్నడని విమర్శ 

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి.. బీజేపీ కోవర్టు అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పదో, పన్నెండు మందో ఎమ్మెల్యేలు గెలిస్తే.. వాళ్లందరినీ గంపగుత్తగా తీసుకుని బీజేపీలోకి వెళ్తాడని చెప్పారు. ఈ విషయం రాహుల్​గాంధీకే తెలియదన్నారు. గురువారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్​ లీడర్లు ప్రజల దగ్గరికి వచ్చి అధికారం ఇవ్వాలని అడుగుతున్నారని.. వాళ్లు పవర్​లో ఉన్నప్పుడు కరెంట్, సాగు, తాగు నీరు, పెన్షన్లు ​సక్కగ ఇచ్చిన్రా అని ఆయన ప్రశ్నించారు.


‘‘పండుగొస్తే గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు, ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు మీ చుట్టూ తిరుగుతాయి. వాళ్లను చూసి ఆగం కావొద్దు. ఒక్కొక్కరు పది మందిని తయారు చేసి బీఆర్ఎస్​కు ఓట్లెయ్యాలి” అని పిలుపునిచ్చారు. ‘మాకంటే శారీరక వైకల్యం ఉంది.. మీకు ఏమైంది మానసిక వైకల్యం ఉందా? గా పార్టీ గురించి ఎవడైనా ఆలోచిస్తడా?’ అని ప్రజలను చైతన్యవంతులను చేయాలని దివ్యాంగులకు సూచించారు. 

మీరా.. కుటుంబ పాలన గురించి మాట్లాడేది?  

రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్​ది కుటుంబ పాలన అంటున్న రాహుల్​గాంధీ ఎవడసలు? జవహర్​లాల్​నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్​గాంధీ భార్య సోనియాగాంధీ కొడుకు ఇక్కడికొచ్చి గొంగళ్ల కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నరు. సోనియాగాంధీ, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ ఒకే వేదికపై ఉండొచ్చు గానీ.. కేసీఆర్​ది కుటుంబ పాలన అంటున్నరు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరుగుతది.

కొంచెం బుర్రాబుద్ధి ఉంటే ప్రాజెక్టు ఖర్చు కన్నా ఎక్కువ అవినీతి చేసిన్రని అంటరా.. రాహుల్​గాంధీ తెల్ల కాగితం.. ఆయనకు ఏం తెల్వది.. రాసిచ్చినది చదువుతడు.. కేసీఆర్ ది అవినీతి పాలన అంటడు.. రాహుల్​గాంధీ పక్కకు ఎవడున్నడు రేవంత్​రెడ్డి.. అంతకంటే పెద్ద గజదొంగ దేశంలో ఎవరన్నా ఉన్నరా.. ఆయనకంటే దావూద్​ఇబ్రహీం, చార్లెస్​శోభరాజ్​కూడా చిన్నోళ్లు.. ఆనాడు ఓటుకు నోటు.. ఈనాడు సీటుకు రేటు.. రేపు రాష్ట్రమంతా టోకున అమ్ముతడు.. కాంగ్రెస్​ను బీజేపీకి అమ్మిపారేస్తడు.. గసోంటోన్ని పక్కన కూసోబెట్టుకొని రాహుల్​గాంధీ మాట్లాడుతున్నడు” అని ఫైర్ అయ్యారు. 

కాంగ్రెస్ అంటేనే చోర్ టీమ్.. 

కాంగ్రెస్​అంటేనే చోర్​టీమ్​అని కేటీఆర్ విమర్శించారు. ‘‘రేవంత్ రెడ్డి ఒక 420. ఆయనకన్నా అవినీతి పరుడు ఎవరూ లేరు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్. దేశంలో ఆకాశం నుంచి భూమి లోపలి దాకా ఏ టూ జెడ్​కుంభకోణాలు చేసిందే కాంగ్రెస్​పార్టీ. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడగడానికి వాళ్లకు సిగ్గుండాలి. 11 సార్లు ఆ పార్టీకి చాన్స్​ఇస్తే మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఫ్లోరోసిస్​తో అల్లాడుతున్న నల్గొండకు ఆ పార్టీ చేసిందేమీ లేదు. కాంగ్రెస్​ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఒక్క నల్గొండ జిల్లాలోనే లక్ష మందికి పైగా ఫ్లోరోసిస్​తో వికలాంగులయ్యారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఒక్క చాన్స్​అడుగుతోంది. ఆ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలి. పైన కేసీఆర్​.. కింద సంక్షేమ పథకాలు అందుతున్న ప్రజలు హ్యాపీగానే ఉన్నారు.

సీట్లు, పదవులు రాలేదన్న కోపంతో ఉన్న ఖద్దరు చొక్కాలోల్లు మాత్రమే ఖుషీగా లేరని ఇటీవల సిరిసిల్లలో ఓ పెద్ద మనిషి నాతో అన్నారు” అని చెప్పారు. ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చే కేసీఆర్ ఒకవైపు​ఉంటే..  ఓటుకు నోటు దొంగ, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికాకు పారిపోయిన లీడర్లు మరొకవైపు ఉన్నారు. ఈ ఆకు సిపాయిలా కేసీఆర్​తో పోటీ పడేది” అని ప్రశ్నించారు. సమావేశంలో దివ్యాంగుల కార్పొరేషన్​చైర్మన్​ వాసుదేవరెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్​రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు మంద జగన్నాథం, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గానికో దివ్యాంగుల భవన్..  

బీఆర్ఎస్​ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గానికి, జిల్లాకు ఒక దివ్యాంగుల భవన్​ నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘‘దివ్యాంగుల కోసం తొమ్మిదిన్నరేండ్లలో రూ.10,300 కోట్లు ఖర్చు చేశాం. 2.25 లక్షల మందికి ట్రై స్కూటర్లు, ఇతర వాహనాలు అందజేశాం. దివ్యాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 5 శాతానికి పెంచాం. దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక పెన్షన్​ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల్లో వందల్లోనే పింఛన్​ఇస్తున్నారు. అలాంటి పార్టీలు వచ్చి అబద్ధపు మాటలతో మోసం చేయాలని చూస్తున్నాయి. పనులు చేయకుండా డైలాగులు కొడితేనే ఓట్లు పడతాయా?” అని ప్రశ్నించారు.