చంద్రబాబు అరెస్టుపై లోకేష్ ఫోన్ చేసిండు.. ధర్నాలు, ర్యాలీలు అక్కడ చేయండి..ఇక్కడెందుకు..

చంద్రబాబు అరెస్టుపై లోకేష్  ఫోన్ చేసిండు.. ధర్నాలు, ర్యాలీలు అక్కడ చేయండి..ఇక్కడెందుకు..

చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు ఏం సంబంధం అన్నారు మంత్రి కేటీఆర్. చంద్రబాబు అరెస్ట్ అయితే హైదరాబాద్ లో ఎందుకు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ పై హైదరాబాద్ లో ర్యాలీలు, ధర్నాలు చేస్తామంటే ఊరుకోమన్నారు. ర్యాలీలు, ధర్నాలు చేస్తే రాజమండ్రిలో చేయాలని సూచించారు. కానీ హైదరాబాద్ లో ధర్నాలు ,ర్యాలీలు తీసి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దన్నారు. ఐటీ కారిడార్ లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీలు కాలేదని... ఐటీ సెక్టార్ దెబ్బతింటుందని అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ గురించి  బీఆర్ఎస్ లో  ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడి ఉండొచ్చని.. అది పార్టీ అభిప్రాయం కాదన్నారు. 

చంద్రబాబు అరెస్ట్ అనేది  రెండు పార్టీల మధ్య సమస్య అని చెప్పారు మంత్రి కేటీఆర్. టిడిపి..వైసీపీ..తెలంగాణలో లేవన్నారు.  పక్కింట్లో పంచాయితీ హైదరాబాద్ లోడ ఎందుకు...ఏపీలో పంచాయితీపై హైదరాబాద్ లో కొట్లాడతాం అంటే ఎలా అని ప్రశ్నించారు. తాము హైదరాబాద్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని..ఇక్కడి ప్రజల భద్రతే మాకు ముఖ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబుపై ప్రేమ, అభిమానం ఉంటే  విజయవాడ, అమరావతి, కర్నూల్ లో ధర్నాలు, ర్యాలీలు చేయాలని సూచించారు. తన అరెస్టుపై చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారని.. చంద్రబాబు కేసు కోర్టులో ఉందన్నారు.  ఆయనకు ఏం న్యాయం జరుగుతుందో  జరగనీ అని చెప్పారు. 

Also Read :- తెలంగాణలో కాలు పెట్టే అర్హత మోదీకి లేదు.. బీజేపీకి డిపాజిట్లు గల్లంతు

చంద్రబాబు అరెస్ట్ అయితే హైదరాబాద్ లో ధర్నాలు చేస్తే పోలీసులు అడ్డుకున్నప్పుటు లోకేష్ తనకు ఫోన్ చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఆందోళనలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించినట్లు చెప్పారు. కానీ తాము ప్రజల శాంతిభద్రతలు ముఖ్యమని చెప్పామన్నారు.  ఇవాళ మీకు పర్మీషన్ ఇస్తే రేపు ఇంకొకరు వచ్చి ధర్నాలు చేస్తామంటారని..ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు అయినా..  ఏపీలో చేసుకోవాలని లోకేష్ కు చెప్పామన్నారు. 

 తమకు ఆంధ్రాతో  తగాదాలు లేవన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికిప్పుడు  పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏపీలో  జగన్ , పవన్ , లోకేష్ అందరూ తనకు స్నేహితులేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.  ఏపీ, తెలంగాణ మధ్య  లేని పోని పంచాయితీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పదేండ్లుగా  ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు సుఖంగా, సుబీక్షంగా ఉన్నారని.. లేని రాజకీయ కక్షలు ప్రజలకు చుట్టొద్దని కోరారు.