మంత్రి హరీష్ రావుపై మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే మైనంపల్లి కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే మైనంపల్లి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
మైనంపల్లి హన్మంత్ రావు పేరును ప్రస్తావించకుండానే ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, ఎమ్మెల్యే ప్రవర్తనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
హరీష్ రావుకు మైనంపల్లి వార్నింగ్
తన కుమారుడు మైనంపల్లి రోహిత్.. గత ఆరు నెలల నుంచి తన సపోర్టు లేకుండానే మెదక్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే హన్మంత్ రావు. కరోన సమయంలో ప్రాణాకు తెగించి చాలా మందికి వైద్య సేవలు అందించారని చెప్పారు. మెదక్ సీటు విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదన్నారు. తప్పకుండా రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యేగా చేస్తానన్నారు. మంత్రి హరీష్ రావు మెదక్ లో పెత్తానం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
సిద్దిపేట డెవలప్ అయినప్పుడు మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనే పోటీ చేసి, హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని అన్నారు. తాను మల్కాజ్ గిరి నుంచి.. తమ కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తారని చెప్పారు. ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని అధిష్టానం పెద్దలను అడిగానని, ఒకవేళ ఇవ్వకపోతే ఇద్దరికీ టికెట్లు ఇవ్వొద్దని చెప్పానన్నారు.