ప్రపంచానికే ఆదర్శం భారత్

ప్రపంచానికే ఆదర్శం భారత్

కంటోన్మెంట్‌‌, వెలుగు: ప్రపంచానికే దిక్సూచిగా ఇండియా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో ఆర్మీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌‌ మహోత్సవ్‌‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలికి గాయంతో మూడు వారాలుగా ఇంటికే పరిమితమైన తాను.. ఇప్పుడు ఆర్మీ నిర్వహించిన ఈ ఉత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు కాలికి పట్టీ, చేతికర్రతో కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్‌‌కు ఆర్మీ అధికారులు ఘన స్వాగతం పలికారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమైన మన దేశం.. మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంప్రదాయాలు ఉన్నా దేశభక్తిలో మాత్రం అందరూ ఐక్యత చాటుతున్నారని కొనియాడారు. తాను ఐటీ, ఇండస్ట్రీస్‌‌ మినిస్టర్‌‌గా ప్రపంచంలోని వివిధ దేశాల పెట్టుబడిదారులతో సమావేశమైనప్పుడు.. జనాభా, మానవ వనరులు ఇతర అంశాల్లో చైనాతో ఇండియాను పోల్చుతుంటారని తెలిపారు. కానీ తన దృష్టిలో ఇండియాతో ప్రపంచంలోనే వేరే ఏ దేశానితో పోలిక లేదన్నారు.

భారతీయతే ఐక్యంగా నిలుపుతున్నది

దేశంలోని ప్రతి వంద కిలోమీటర్లకు భాష, యాస, కట్టుబొట్టు, ఆహారపు అలవాట్లు మారుతాయని, కానీ అందరినీ భారతీయత ఐక్యంగా నిలుపుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 75 ఏండ్లలో మన దేశం సాధించిన విజయాలకు తోడు మనలోని ఐకమత్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన త్రివిధ దళాల అధికారులు, సిపాయిల కుటుంబ సభ్యులను మహావీర్‌‌ పురస్కారాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా సైనికులు, కళాకారులు, విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.