నేను ఐఏఎస్‌‌ కావాలని నాన్నకు, డాక్టర్ కావాలని అమ్మకు ఉండే : కేటీఆర్‌‌‌‌

నేను ఐఏఎస్‌‌ కావాలని నాన్నకు, డాక్టర్ కావాలని అమ్మకు ఉండే :  కేటీఆర్‌‌‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు :  సిరిసిల్ల ప్రజల ప్రేమ, దయతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్లీ గెలుస్తానని మంత్రి కేటీఆర్‌‌‌‌ అన్నారు. నియోజకవర్గ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచనని చెప్పానన్నారు. శుక్రవారం సిరిసిల్లలో మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్‌‌గా ప్రారంభించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిస కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. ‘‘మనం రేషం గళ్ల బిడ్డలం.. మళ్లీ బానిసలవుదామా, బాసుల్లా ఉందామా’’అని అన్నారు. 

తమకు ఢిల్లీలో బాసులు లేరని, సిరిసిల్ల గల్లీల్లో ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు 64 ఏండ్ల పరిపాలనలో రాష్ట్రంలో రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, ఈ తొమ్మిదేండ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌దేనన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కావాలా.. ఢిల్లీకి గులాంలుగా ఉండే నాయకులు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. డాక్టర్లనే కాదు.. ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలోనూ మనం నంబర్ వన్‌‌గా ఉన్నామని తెలిపారు. 

ALSO READ: కాసానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ​ పరామర్శ

నా జీవితంలో మర్చిపోలేని రోజు.. 

‘‘నేను బైపీసీ స్టూడెంట్‌‌ని. మా అమ్మకు నేను డాక్టర్‌‌‌‌ కావాలని.. మా నాన్నకు ఐఏఎస్ కావాలని ఉండే. కానీ, రాజకీయంలోకి వచ్చి మీ దయతో ఎమ్మెల్యే, మంత్రిని అయ్యా. సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు”అని కేటీఆర్‌‌‌‌ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్లలో ఒక డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేదన్నారు. నర్సింగ్ కాలేజీ, జేఎన్టీయూ కాలేజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీ, గంభీరావుపేటలో కేజీ టు పీజీ కాలేజీ లు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో ఎంతో ప్రగతి సాధించుకున్నామన్నారు. 2009లో సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ బాగు కోసం కృషి చేశానని, ఇప్పుడు ఆధునిక హంగులతో హాస్పిటళ్లను నిర్మించుకొని 100 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. రాష్ట్రంలో 34 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసిన ఘనత దేశంలో తెలంగాణకే దక్కుతుందన్నారు. 

తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే.. 

దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని కేటీఆర్‌‌‌‌ ధ్వజమెత్తారు. మోదీది తెలంగాణపై సవతి తల్లి ప్రేమ అని, రాష్ట్రంపై ఆయన పగబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి, గుండు సహకరించక పోయినా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. రెండుసార్లు రైతు రుణ మాఫీ చేసిన నాయకుడు దేశంలో కేసీఆర్‌‌‌‌ ఒక్కరేనన్నారు. ఏదైనా చేసి కేసీఆర్‌‌‌‌ను గద్దె దించి రాష్ట్రాన్ని ఆగం చేయాలని అనుకుంటున్న వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్‌‌‌‌ పిలుపునిచ్చారు.