సిరిసిల్లలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కేటీఆర్

సిరిసిల్లలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కేటీఆర్

పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు బతుకమ్మ పండుగ సారెగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తన అమ్మమ్మ స్వగ్రామం అయిన కొదురుపాకకు చెందిన మహిళకు తొలి చీర అందించారు. "ఏ చీర నచ్చిందో తీసుకోమని" అడిగి చీరను అందించారు. 

ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ: పుట్టింటి నుంచి వచ్చే చీర-సారెలాగా... సర్కారు తరపున 2017 నుంచి తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు ఇస్తున్నాం అన్నారు. మన సిరిసిల్ల నేసిన కోటి చీరలు రాష్ట్రమంతటా పంపిణీ చేస్తున్నామన్నారు. పప్పు, ఉప్పు, నూనె, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజల కుటంబ భారం పెరిగి.. చుట్టాలను కూడా గౌరవించకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తరపున పేదింటి ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని చీరలు ఇస్తున్నామన్నారు. ఒకప్పుడు సిరిగల ఊరు కాబట్టే.. దీన్ని సిరిసిల్ల అనేవారు. ఒక దశలో ఇక్కడ వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుని అనేక మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. నేతన్నకు పని కల్పించడం, ఆడ బిడ్డలకు కానుక ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ బతుకమ్మ చీరల కార్యక్రమం తీసుకున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

నేతన్నకు చేయూత

నేతన్నల కష్టాలు శాశ్వతంగా తొలగించేందుకు విద్యార్థుల యునిఫామ్స్, రంజాన్ కు ఇచ్చే దుస్తులు, బతుకమ్మ చీరల ఆర్డర్లన్నీ ఇక్కడి కార్మికులకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని కేటీఆర్ తెలిపారు. రైతు బీమాలాగే..నేతన్నలకు కూడా నేతన్న బీమా అందిస్తున్నామని గుర్తు చేశారు. 80 వేల మంది నేత కార్మికలకు ఈ బీమా వర్తింప జేస్తున్నామన్నారు. నేతన్నకు చేయూత పేరుతో పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తోంది. మీరు రూపాయి పొదుపు చేస్తే.. ప్రభుత్వం తరపున 2 రూపాయలు మీ తరపున పొదుపు చేస్తున్నామని అన్నారు. మరమగ్గాల కార్మికులుక 10 శాతం, చేనేత కార్మికులకు 50 శాతం నూలు, రసాయనాలపై రాయితీ ఇస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో 75 ఎకరాల్లో ఉన్న టెక్స్ టైల్ పార్కుకు విద్యుత్ సబ్సిడీతో పాటు.. బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా ఇచ్చామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టెక్స్ టైల్ పార్కులో ఆడబిడ్డలకు స్టైఫండ్ ఇస్తూ కుట్టు వృత్తి శిక్షణ ఇస్తున్నామని.. 60 ఎకరాల్లో సిద్ధమవుతోన్న అప్పారెల్ పార్కులో 10 వేల మంది మహిళలు 10-12 వేల రూపాయలు ఆదాయం వచ్చేలా పని కల్పిస్తామన్నారు. 

తిరుప్పూర్ కు ధీటుగా

పెద్దూరులో 88 ఎకరాల్లో వీవింగ్ పార్కులో వర్కర్ టూ ఓనర్ పథకం కింద కార్మికులను యజమానులను చేసే విధంగా పరిశ్రమలు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. తమిళనాడులోని  తిరుప్పూర్ అనే పట్టణంలో నేతన్నలు  40 వేల కోట్ల విలువైన దుస్తులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లుగా.. మన సిరిసిల్ల కుడా ఆ స్థాయికి ఎదగాలి అన్నారు. మన సిరిసిల్ల నుంచి కేవలం 2 వేల కోట్ల దుస్తులు మాత్రమే ప్రొడక్ట్ అవుతున్నాయని అన్నారు. సీఎం కేసిఆర్ ఆశీస్సులతో నైపుణ్యాలు పెంచుకుంటూ, కొత్త తరహా ఆలోచనలతో తిరుప్పూర్ కు ధీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దుతామని అన్నారు. మీకు అన్ని అందించే మంత్రిగా నేనుండగా.. ఎందుకు ఇంత తక్కువ ఉత్పత్తి చేస్తున్నారని కేటీఆర్ అడిగారు. నేను ఎందుకు తండ్లాడుతున్నానంటే... మీరు బాగుంటేనే.. మళ్లీ నన్ను గెలిపిస్తారు.. అప్పుడు నేను కూడా సంతోషంగా ఉంటాను అని తెలిపారు. ఇందులో వేరే ఎజెండా ఏమీ లేదు స్పష్టం చేశారు. అందరూ వెంటనే తిరుపూర్, కోయంబత్తూరు వస్త్రోత్పత్తి పరిశీలించి రండి అని కేటీఆర్ సూచించారు. మనం కేవలం ముతకబట్ట మాత్రమే తయారు చేస్తాం. కానీ అక్కడ అలా కాదు. మన నేతన్నలకు అద్భుత కళానైపుణ్యాలున్నాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘనత మనోళ్లదే అన్నారు.

అర్హులైన అందరికీ ఫించన్లు

మన సిరిసిల్ల చీరకు న్యూజిలాండ్ లో సిరిసిల్ల పట్టు పేరుతో అమ్ముతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన పవర్ లూమ్స్ అప్ గ్రేడ్ చేసుకుని మనం కూడా తమిళనాడుతో పోటీపడాలి అన్నారు. పండగ వాతావరణంలో బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఆడపిల్లలు సాధారణంగా చీరలకు వంకపెడుతుంటారు.. అందుకే మా స్థాయిలో సాధ్యమైనంత వరకు, చేతనైనంతవరకు సర్వే చేసి అందరికీ నచ్చేలా ఉండే కొన్ని డిజైన్లు తయారు చేశామన్నారు. ఇక ఫించన్లు రాని వారందరూ దరఖాస్తు చేసుకోండని..అర్హులైన అందరికీ ఫించన్లు ఇప్పిస్తామన్నారు. అలాగే నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చాం.. ఇంకా ఎవరికైనా సొంత జాగా ఉంటే ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తామన్నారు.