పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్

పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్

వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత 8 ఏళ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ది చెందిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా కేటీఆర్ ఇవాళ డిప్ల‌మాట్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ (Diplamat outreach program) నిర్వహించారు.హైదరాబాద్ టీ హబ్ 2.0 లో జరిగిన ఈ సమావేశానికి 50 దేశాలకు చెందిన  రాయబారులు, డిప్లమాట్స్, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమీషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. 

తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన పలు కంపెనీలకు గత 8 ఏళ్లుగా తెలంగాణ గమ్యస్థానంగా మారడం, ఆయా కంపెనీలు విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ వివరించారు. 

స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతో పాటు దేశంలోనే అత్యుత్తమ ఎకో సిస్టం తెలంగాణ సొంతమని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,  లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలు తెలంగాణని తమ గమ్యస్థానంగా ఎంచుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. 

తెలంగాణ పెట్టుబడుల సలహాదారు (TIA)పేరుతో రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్ బొట్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ తర్వాత పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వివిధ అంశాలపైన తమ అభిప్రాయాలను తెలియచేశారు. ఆ తరువాత దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టీ హబ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న వివిధ స్టార్టప్ ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వీ హబ్, టీ వర్క్స్, టీఎస్ఐసీ, టాస్క్ సంస్థల లక్ష్యాలు, పనితీరును దౌత్యవేత్తలు ప్రశంసించారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, టీ హబ్ సీఈఓ ఎం శ్రీనివాస్ రావు, పరిశ్రమల శాఖ, ఐటీ శాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.