ఓపిక నశిస్తే పోరాటమే

ఓపిక నశిస్తే పోరాటమే
  • కేంద్రం ఈసారైనా బడ్జెట్ లో నిధులియ్యాలె: కేటీఆర్
  • ఏడేండ్లుగా రిక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకుంటలేదని ఫైర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏడేండ్లుగా తాము చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకుంటలేదని ఫైర్ అయ్యారు. ఇప్పడు ఎనిమిదోసారి అడుగుతున్నామని, ఈసారైనా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. ఇక ఓపిక నశిస్తే పోరాటానికి కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘పీఎం మిత్ర పథకం కింద రూ.897. 92 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి చాలాసార్లు విజ్ఞప్తి చేశాం. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్, జమ్మికుంట, నల్గొండ వంటి ప్రాంతాలకు చేనేత క్లస్టర్లు మంజూరు చేయాలని కోరాం. రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్ టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్  ఏర్పాటు చేయాలని అడిగాం. కానీ ఇవేవీ కేంద్రం పట్టించుకోవడం లేదు” అని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ పైనా ఫైర్ అయ్యారు. ‘‘బండి సంజయ్.. రాజకీయాలు బంద్ చేయండి. సిరిసిల్ల నేతన్నల సమస్యలపై దృష్టి సారించండి. సిరిసిల్ల కూడా మీ నియోజకవర్గ పరిధిలోనే ఉందని మరిచిపోకండి. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం ప్రయత్నం చేయండి. లేకపోతే మిమ్మల్ని, మీ పార్టీ ఏం చేయాలనే దానిపై నేతన్నలు ఆలోచిస్తరు” అని అన్నారు. 

టెక్స్‌‌ టైల్‌‌ పార్క్‌‌కు నిధులివ్వండి...

రాష్ట్ర సర్కార్ చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌, మెగా పవర్‌‌లూమ్‌‌ క్లస్టర్‌‌, ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌‌, పీయూష్‌‌ గోయల్‌‌కు లేఖ రాశారు. వరంగల్‌‌లోని కాకతీయ టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌లో సౌలతుల కోసం రూ.897.92 కోట్లు ఇవ్వడంతో పాటు, ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో మెగా పవర్‌‌ లూమ్‌‌ క్లస్టర్‌‌ను రూ.993.65 కోట్లతో ప్రతిపాదించామని, దీనికి రూ.49.84 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పోచంపల్లిలో ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ హ్యాండ్లూమ్‌‌ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.