కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

పెట్రోల్ ధరల దోపిడిపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. విపరీతంగా ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్,  డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటుందని ఆరోపించారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ  కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు.

2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. . అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందన్నారు.  కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతుందని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందన్నారు.

 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగిందన్నారు కేటీఆర్. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు.  భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోందన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించిందన్నారు.  అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత 45  సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోందని విమర్శించారు కేటీఆర్.

మరోవైపు తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి  ఒక్క రూపాయి వ్యాట్ ను పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో 30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందని ఆరోపించారు. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.

ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారని చెప్పారు.   ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలని.. లేకుంటే ప్రజల చేతిలో  కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు కేటీఆర్.