ఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర : మంత్రి మల్లారెడ్డి

ఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర : మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ : రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తాము దొంగ దందాలు చేయడం లేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు తన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తన కొడుకును వేధించడంతోనే ఆస్పత్రి పాలయ్యాడని ఆరోపించారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డికి హాస్పిటల్ లో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ప్రవీణ్ రెడ్డికి కూడా ట్రీట్మెంట్ నడుస్తోందని అన్నారు. సోదాల పేరుతో దౌర్జన్యం చేయడం సరికాదని మల్లారెడ్డి వాపోయారు.

హాస్పిటల్లో ఉన్న కొడుకు మహేందర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఆయన ఆస్పత్రి వద్దే ఉన్నారు. టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు మహేందర్ రెడ్డిని పరామర్శించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి నివాసం నుంచి అధికారులు భారీ మొత్తంలో నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.

మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్ రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లారెడ్డి నివాసం వద్ద టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు బందోబస్తులో ఉన్నారు.