సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

ఎలక్షన్లప్పుడే మా ఊరు యాదికొస్తదా?
సొంత నియోజకవర్గంలో మల్లారెడ్డికి నిరసన సెగ
రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నయంటూ నిలదీత
మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రిలో మంత్రిని అడ్డుకున్న స్థానికులు

శామీర్‌‌‌‌పేట/మేడ్చల్ వెలుగు : మంత్రి మల్లారెడ్డికి సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని ఉద్దెమర్రి గ్రామంలో పర్యటిస్తుండగా ఆయన కాన్వాయ్‌‌ని స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు పరిస్థితి అధ్వానంగా ఉందని.. మట్టి పోసి వదిలేయడంతో వర్షానికి రోడ్లన్నీ బురదగా మారాయని మండిపడ్డారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే తమ గ్రామం గుర్తుకు వస్తుందా అంటూ మహిళలు నిలదీశారు. కనీసం ఉండటానికి ఇండ్లు కూడా లేవని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజుల తర్వాత మంత్రి తమ గ్రామానికి వచ్చారని, సమస్యలను చెప్పుకోవడానికి వెళ్తే లీడర్లు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడ్చల్ మున్సిపాలిటీలోనూ..

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి నాలుగో వార్డుకు వచ్చిన మంత్రి మల్లారెడ్డికి అక్కడా నిరసన ఎదురైంది. డబుల్ బెడ్రూమ్‌‌ ఇండ్లు స్థానికులకే ఇవ్వాలని కిష్టపూర్, వినాయక నగర్ వాసులు డిమాండ్ చేశారు. బీసీ కమిటీ హాల్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్రకులాల భవనాలకు అధిక నిధులు వెచ్చించి, దళిత భవనాలకు తక్కువ నిధులు ఇస్తున్నారని మల్లారెడ్డిని ఎమ్మార్పీఎస్ నేతలు నిలదీశారు. ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు స్థానికులను కాకుండా ఇతరులను ఎంపిక చేయడం ఏంటని మండిపడ్డారు. ఎన్నో ఏండ్లుగా ఎస్సీ కమ్యూనిటీ భవనం శిథిలావస్థలో ఉందని, వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు జోక్యం చేసి చేసుకొని నిరసనకారులను అక్కడి నుంచి పంపించారు.