నాకు ఎవరితో లొల్లి లేదు: మంత్రి మల్లారెడ్డి

నాకు ఎవరితో లొల్లి లేదు: మంత్రి మల్లారెడ్డి

తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేడ్చల్ జిల్లాలోని ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మంత్రి మల్లారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తాను ఎవరితోనూ విబేధాలు పెట్టుకోనని..ఆ ఉద్దేశమే తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు తనకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. తానే స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడుతానని తెలిపారు. తాను గాంధేయవాదినని..ఇది తమ ఇంటి సమస్యగా పరిగణిస్తూ సమస్య పరిష్కారిస్తానని చెప్పారు. ఈ ఇష్యూపై కావాలనే మీడియానే అతిగా చూపిస్తుందని తెలిపారు. 

 జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు టీఆర్​ఎస్​ను కేసీఆర్ బీఆర్​ఎస్​గా మారిస్తే.. రాష్ట్రంలో మాత్రం బీఆర్​ఎస్​ నేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి తీరుపై సొంత పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు వివేకానంద్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మైనంపల్లి ఇంట్లో వీళ్లంతా సమావేశమయ్యారు. మేడ్చల్​ జిల్లా లోని అన్ని పదవులను తన అనుచరులకే మంత్రి మల్లారెడ్డి ఇచ్చుకుంటున్నారని, తమను ఖాతర్​ చేయడం లేదని వారు మండిపడ్డారు. విషయాన్ని కేసీఆర్​, కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యేల భేటీ గురించి తెలుసుకున్న మీడియా ప్రతినిధులు మైనంపల్లి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మేడ్చల్​ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి సమావేశమయ్యామని అంటూనే మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి  వ్యక్తం చేశారు. అధిష్టానం అనుమతి లేకుండా ఇలా ఐదుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవడం బీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

మల్లారెడ్డివన్నీ ఒంటెద్దు పోకడలు

మంత్రి మల్లారెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు. తమ సమస్యలను మంత్రిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిందిపోయి తమను లెక్కచేయడంలేదని అన్నారు. మేడ్చల్ జిల్లాలో పదవులన్నీ కేవలం మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్​కే పరిమితవుతున్నాయని ఆరోపించారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో మంత్రి కేటీఆర్​తో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పిన తర్వాత  కూడా మంత్రి మల్లారెడ్డి రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని,  ప్రొటోకాల్ పాటించకుండా ప్రమాణం చేయించారని అన్నారు. రాష్ట్రంలో, గ్రేటర్​ హైదరాబాద్​లో పార్టీ పటిష్టంగా ఉందని, కార్యకర్తలకు పదవులు ఇచ్చి న్యాయం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ఉందని పేర్కొన్నారు.  జిల్లాలోని పదవులు కేవలం మేడ్చల్ నియోజకవర్గానికే పరిమితమవుతుండడంతో మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలమైన తమపై ఒత్తిడి పెరుగుతున్నదని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో పదవులను ఒక్కొక్కరికి రెండు , మూడు సార్లు ఇస్తున్నారని విమర్శించారు. బాధ్యత గల మంత్రిగా జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. రాత్రికి రాత్రి నిర్ణయాలతో పార్టీ ఇబ్బందులు పడుతుందని పేర్కొన్నారు.  మంత్రిగా మల్లారెడ్డి అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. అధిష్టానం చెప్పినా మంత్రి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కోసమే పోరాటం చేస్తున్నామని అన్నారు. న్యాయం చేయాల్సిన మంత్రి ఒంటెద్దు పోకడలకు పోవడం  ఎంతవరకు కరెక్ట్​ అని  ప్రశ్నించారు. మంత్రి తీరును  కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.